ఫోన్ ట్యాంపిగ్ కేసులో మరో సంచలనం.. ఇద్దరు అదనపు ఎస్పీలు అరెస్టు

ప్రణీత్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆయన్ను కస్టడీలోకి తీసుకొని విచారించగా పలు సంచలన అంశాలు వెలుగు చూశాయి

Update: 2024-03-24 04:49 GMT

చేసుకున్నోడికి చేసుకున్నంత అని ఊరికే అనలేదు. హద్దులు మీరి.. గీతలు దాటేసి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించే అధికారులు తర్వాతి కాలంలో ఎలాంటి తిప్పలు పడతారన్న దానికి నిదర్శనంగా తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో కొందరి మాటలకు తలాడించిన కొందరు పోలీసు అధికారులు చట్టవిరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన వైనం వెలుగు చూడటం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రణీత్ రావును అరెస్టు చేసి విచారించారు. ఈ క్రమంలో మరికొన్ని పెద్ద తలకాయల పేర్లు తెర మీదకు వచ్చాయి.

ప్రణీత్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆయన్ను కస్టడీలోకి తీసుకొని విచారించగా పలు సంచలన అంశాలు వెలుగు చూశాయి. ట్యాపింగ్ కేసులో భూపాలపల్లి అదనపు ఎస్పీగా వ్యవహరిస్తున్న భుజంగరావు.. హైదరాబాద్ నగర భద్రత విభాగం అదనపు డీసీపీ తిరపతన్నను హైదరాబాద్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వీరిని ఉదయమే అదుపులోకి తీసుకొన్నప్పటికీ సమాచారాన్ని వెల్లడించలేదు. దాదాపు ఎనిమిది గంటల పాటు సాగిన విచారణ అనంతరం శనివారం అర్థరాత్రి వేళ.. వీరిని అరెస్టు చేసినట్లుగా వెల్లడించారు.

స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) డీఎస్పీగా పని చేసి సస్పెండ్ అయిన దుగ్యాల ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉంటే.. విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ కుపాల్పడినట్లుగా గుర్తించారు. అంతేకాదు.. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఒక న్యూస్ చానల్ కు ప్రముఖుడికి లింకులు ఉన్నట్లుగా తేల్చారు. అంతేకాదు.. ఈ ట్యాపింగ్ లో ఇప్పటికే ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు.. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుల పాత్రను గుర్తించారు. అయితే.. ఈ ముగ్గురు విదేశాలకు పారిపోయినట్లుగా ఆరోపణల్ని ఎదుర్కొంటున్నారు.

ఇప్పటికే దేశం దాటిన ఈ ముగ్గురిని దేశానికి తిరిగి తీసుకొచ్చేందుకు వీలుగా లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. అంతేకాదు.. ఈ ఉదంతంలో విచారణకు హాజరు కావాలంటూ గతంలో ఎస్ఐబీలో పని చేసిన తొమ్మిది మందికి నోటీసులు ఇవ్వటం తెలిసిందే. ప్రణీత్ రావు చేసిన ఫోన్ ట్యాపింగ్ మొత్తం అతడి సొంత నిర్ణయం కాదని.. గత ప్రభుత్వంలో కీలక భూమిక పోషించిన వారి ఆదేశాలతో జరిగినట్లుగా భావిస్తున్నారు. దీనికి సంబంధించిన తీగ లాగిన పోలీసులుఇప్పుడు డొంకను వెతికే పనిలో పడ్డారు. రానున్న రోజుల్లో ఈ కేసుకు సంబంధించి సంచలన పరిణామాలు చోటు చేసుకుంటాయన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News