ఎవరు గెలిచినట్లు.. కేసీఆర్ హా? గవర్నర్ హా?
తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. నాలుగు రోజులు సాగిన అసెంబ్లీలో మొత్తం 8 బిల్లులు ఆమోదం పొందాయి
తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. నాలుగు రోజులు సాగిన అసెంబ్లీలో మొత్తం 8 బిల్లులు ఆమోదం పొందాయి. ఇందులో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లు కూడా ఉంది. దీనికి కూడా సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు పాస్ అవడంతో ఇప్పుడు కేసీఆర్ పైచేయి సాధించారా? లేదా గవర్నర్ గెలిచారా? అనే చర్చ సాగుతోంది.
kcr vs governor over rtc bill
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామని, ఇకపై ఆర్టీసీ ఉద్యోగులు అందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతారని కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాన్ని కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. దీన్ని గవర్నర్ దగ్గరకు పంపించారు. ఆమె కొన్ని సందేహాలు లేవనెత్తుతూ వివరణ కోరడంతో ఉత్కంఠ రేగింది. మరోవైపు బిల్లును గవర్నర్ ఆమోదించాలంటూ ఆర్టీసీ కార్మికులూ ధర్నాకు దిగారు. గవర్నర్ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలు పంపడం.. మరింత వివరణ కోరుతూ గవర్నర్ ఇంకొన్ని సందేహాలు లేవనెత్తడం కూడా తెలిసిందే. దీనిపై ప్రభుత్వం మళ్లీ జావాబిచ్చింది.
ఇలా ఆర్టీసీ బిల్లుపై కేసీఆర్ వర్సెస్ గవర్నర్ అన్నట్లుగా పరిస్థితి మారింది. ఇద్దరిలో ఎవరూ తగ్గలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 40 వేలకు పైగా ఆర్టీసీ కార్మికులతో పాటు వీళ్ల కుటుంబాల ఓట్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నంలో కేసీఆర్ తొలి అడుగు వేశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ బిల్లులోని లోపాలను బయట పెట్టడం ద్వారా.. కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చేలా గవర్నర్ చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఒక బిల్లుతో ఇటు కేసీఆర్, అటు గవర్నర్ ఇద్దరూ తమ పంతం నెగ్గించుకున్నట్లయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.