పవన్ తో ప్రచారం.. తెలంగాణ టీడీపీ కోరిక నెరవేరుతుందా?
ఈ నేపథ్యంలో తెలంగాణలో సైతం జనసేనతో కలిసి పోటీ చేయాలని టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నాయని తెలుస్తోంది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. అధికార బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పాక్షికంగా అభ్యర్థుల జాబితాలను ప్రకటించాయి. మిగిలిన పార్టీలు ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులను ఒకటి రెండు రోజుల్లో ప్రకటించనున్నాయి.
మరోవైపు జనసేన పార్టీ కూడా తెలంగాణలో పోటీ చేసే స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. 32 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ఆశ్చర్యపరిచింది. మరోవైపు టీడీపీ సైతం తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే 87 మంది అభ్యర్థుల జాబితా సిద్ధంగా ఉందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. చంద్రబాబుకు చూపించి అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేస్తామన్నారు.
మరోవైపు తెలంగాణలో టీడీపీ తరఫున ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రచారం చేస్తారని కూడా కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. అలాగే నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని పోటీ చేయడం కూడా ఖాయమైంది. ఆమె కూకట్ పల్లి, ఎల్బీనగర్ రెండు స్థానాల నుంచి బరిలోకి దిగొచ్చని చెబుతున్నారు.
కాగా ఆంధ్రప్రదేశ్ లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో సైతం జనసేనతో కలిసి పోటీ చేయాలని టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నాయని తెలుస్తోంది. తెలంగాణలో భారీ ఎత్తున ఉన్న మున్నూరు కాపు సామాజికవర్గం, దండిగా ఉన్న మెగాభిమానుల బలం, హైదరాబాద్ నగర పరిధిలో పలు నియోజకవర్గాల్లో భారీగా ఉన్న కాపు సామాజికవర్గం జనసేన పార్టీ తెలంగాణలోనూ ఉండాలని కోరుకుంటున్నట్టు సమాచారం. అలాగే కొంతమంది సినీ రంగానికి చెందినవారు ఇదే కోరికను బయటపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేనకు కాపు కాసే చోట ఆ పార్టీ 32 మంది అభ్యర్థులను బరిలో దించింది.
టీడీపీ ఆశిస్తున్నట్టు తెలంగాణలోనూ జనసేనతో కలిసి పోటీ చేస్తే కమ్మలు, కాపులు, మెగా, నందమూరి అభిమానులు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో రెండు పార్టీలు పొత్తుతో పోటీ చేస్తే కొన్ని సీట్లను కొల్లగొట్టవచ్చని టీడీపీ భావిస్తున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో తెలంగాణలో బాలకృష్ణతోపాటు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేస్తే మంచి ఫలితం ఉంటుందని టీడీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
కాగా ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారని ఆ పార్టీ శ్రేణులు తెలిపాయి. ఇప్పుడు టీడీపీ ఆశిస్తున్నట్టు రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే ఇరు పార్టీల సంయుక్త అభ్యర్థుల తరఫున బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ పోటీ చేసే వీలుందని ప్రచారం జరుగుతోంది.