తెలుగు లడ్డూ.. కన్నడ నెయ్యి.. ఏమిటీ 'నందిని'? ఎందుకంత బెస్ట్?

నందిని అనేది కర్ణాటక ప్రభుత్వ బ్రాండ్. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) దీని ఆధీన సంస్థ. పాలు, నెయ్యి ఇతర అనుబంధ ఉత్పత్తులు తయారు చేస్తుంటుంది.

Update: 2024-09-21 08:27 GMT

తెలుగు ప్రజలకు అత్యంత ఇష్టమైన తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) లడ్డూ నాణ్యతపై ఇప్పుడు విపరీతమైన దుమారం రేగుతోంది. దీంతో కర్ణాటక సర్కారుకు చురుకు తగిలింది. నందిని నెయ్యి మీద ఆదేశాలు జారీచేసింది. అది కూడా రాష్ట్రమంతటా వర్తించేలా కావడం గమనార్హం. వాస్తవానికి 50 ఏళ్లుగా తిరుమలకు నందిని నెయ్యిని అందిస్తోంది కర్ణాటక ప్రభుత్వం. కానీ.. ఆ రాష్ట్రంలో దీనిపై విమర్శలు ఉన్నాయి. తితిదేకు రాయితీపై నెయ్యి ఇవ్వడంపై కోర్టులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఎన్నో గుడులకు నిధులు లేవని.. భక్తులు భారీగా వచ్చే ఎ, బి గ్రేడ్‌ ఆలయాలకు రాబడి ఉంటున్నా సీ, డీ గ్రేడ్ ఆలయాలకు ప్రసాదాలు పెట్టే స్థోమత లేదని… వీటికి నెయ్యి, పాలు అందించలేని ప్రభుత్వం.. ఏపీలోని ఇవ్వడంపై పలువురు ప్రశ్నించారు.

కర్ణాటక మిల్క్ ఫెడరేషన్

నందిని అనేది కర్ణాటక ప్రభుత్వ బ్రాండ్. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) దీని ఆధీన సంస్థ. పాలు, నెయ్యి ఇతర అనుబంధ ఉత్పత్తులు తయారు చేస్తుంటుంది. టీటీడీకి చాలా సంవత్సరాలు నెయ్యిని అందించింది. ఇది 350 మెట్రిక్‌ టన్నులపైనే ఉంటుంది. అయితే, నందిని కాకుండా వేరే సంస్థ కొన్నాళ్లుగా టీటీడీకి నెయ్యి అందిస్తోంది. ఇప్పుడు లడ్డూ వివాదం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలోని ప్రతి ఆలయంలో పంపిణీ చేసే ప్రసాదం, వెలిగించే దీపాలు, సత్రాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నందిని ఉత్పత్తులనే వాడాలని ఆదేశించింది. అంటే లడ్డూ, కేసరిబాత్, హల్వా, చక్కెర పొంగలి, పంచామృతాల్లో నందిని ఉత్పత్తులే వినియోగించాలి. ఇది కర్ణాటకలో నందిని పాల ఉత్పత్తిదారులు, వ్యాపారులకు అనుకోని వరంగా మారింది.

మైసూరులో పరిశీలన..

కర్ణాటకలో మొత్తం 1.80 లక్షల ఆలయాలున్నాయి. వీటిలో 35,500 దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నాయి. వీటిలో ప్రసాదాల తయారీకి వాడే నెయ్యి, ఇతర ముడి పదార్థాల నాణ్యత పరీక్షల కోసం మైసూరులోని కేంద్ర ఆహార, సాంకేతిక పరిశోధన సంస్థ (సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నాలజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌- సీఎఫ్‌ టీఆర్‌ఐ) ప్రయోగశాలల్లో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేస్తారు. భారతీయ ఆహార భద్రత విలువ సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ) ప్రమాణాల ఆధారంగానే ఈ ప్రసాదాలకు ధ్రువీకరణ చేయాలి.

కర్ణాటకలో పాల రాజకీయం

బీజేపీ ప్రభుత్వం ఉండగా.. ఎన్నికల ముంగిట ఏడాదిన్నర కిందట కర్ణాటకలో పెద్ద దుమారమే రేగింది. అదేమంటే నందిని బ్రాండ్ ను గుజరాత్ కు చెందిన అమూల్ లో విలీనం చేస్తున్నారన్న ఊహాగానాలు రావడమే. దీంతో తమ ప్రైడ్ అయిన నందిని బ్రాండ్ గురించి కన్నడిగులు గళమెత్తారు. చివరకు విలీనం లేదని తేలిపోవడంతో చల్లబడ్డారు. కాగా, 2023కు ముందు వరకు శ్రీవారి లడ్డూ కోసం దాదాపు 50ఏళ్ల పాటు నందిని ఆవు నెయ్యినే వాడారు. భారతీయ డైరీ పరిశ్రమలో 'నందిని మిల్క్' బ్రాండ్ కు అంత గుర్తింపు ఉంది. 1974 నుంచి కర్ణాటక డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద పనిచేస్తున్న ఈ నందిని మిల్క్.. ఆ రాష్ట్రంలో దాదాపు ప్రతి ఇంట్లో ఒక భాగం! అమూల్ తర్వాత దేశంలో అతిపెద్ద మిల్క్ కార్పొరేషన్ కేఎంఎఫ్. స్వచ్ఛమైన నందిని నెయ్యిని ఆవు పాలతో, సంప్రదాయ పద్ధతిలో తయారు చేస్తారు. నాణ్యతను పరీక్షించేందుకు పక్కాగా చర్యలు తీసుకుంటారు. అనేక దశల నాణ్యతా పరీక్షల తర్వాతే మార్కెట్ లోకి వదులుతారు. తిరుపతి లడ్డూలో ఉపయోగించిన నందిని నెయ్యికి AGMARK సర్టిఫికేట్ కూడా ఉంది. AGMARK అంటే.. "అగ్రికల్చర్- మార్క్.

తెలుగు మార్కెట్ లోనూ..

కొన్నాళ్లుగా తెలుగు రాష్ట్రాల మార్కెట్ లోనూ నందిని పాలు కనిపిస్తున్నాయి. అమూల్, హెరిటేజ్, ఆరోగ్య వంటి బ్రాండ్లను గట్టిగా ఢీకొంటోంది నందిని. కాస్త తక్కువ ధర ఉండడం, నాణ్యత బాగుండడంతో ఆదరణ దక్కుతోంది.

Tags:    

Similar News