'జమిలి' జేపీసీలో తెలుగు ఎంపీలు ఐదుగురు..
జమిలి ఎన్నికలు (లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలను) ఒకేసారి నిర్వహించేలా తెచ్చిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కీలక ముందడుగు వేసింది.
జమిలి ఎన్నికలు (లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలను) ఒకేసారి నిర్వహించేలా తెచ్చిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కీలక ముందడుగు వేసింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి చేరింది. గత మంగళవారం లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు పెట్టింది. అయితే, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగించేలా ఉందని.. దీనిని జేపీసీకి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అలాంటిదేమీ లేదని అధికార ఎన్డీఏ స్పష్టం చేసినా.. చివరకు ఇతర పక్షాల అభిప్రాయాన్ని గౌరవించి జేపీసీకి ఓకే చెప్పింది. అలా శుక్రవారం జేపీసీకి చేరింది.
31 కాదు.. 39..
తొలుత జేపీసీలో 31 మంది సభ్యులు ఉంటారని భావించారు. 129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనానికి ఏర్పాటు చేసిన ఈ జేపీసీలో లోక్ సభ సభ్యులు 21, రాజ్యసభ సభ్యులు 10 మంది అని తొలుతు ప్రకటించారు. కానీ, లోక్ సభ సభ్యుల సంఖ్యను 27కు, రాజ్య సభ సభ్యుల సంఖ్యను 12కి పెంచారు. అంటే మొత్తం 39 మందితో జేపీసీ ఉంటుందన్నమాట.
అదానీతో మొదలై.. జేపీసీతో ముగింపు
నవంబరు 25 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి. సరిగ్గా అదే సమయంలో ప్రముఖ వ్యాపారవేత్త
గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు, మణిపూర్ లో మళ్లీ హింస, ఢిల్లీ కాలుష్యంపై కేంద్ర ప్రభుత్వాన్ని విపక్షాలు నిలదీశాయి. ఈ క్రమంలో పలుసార్లు వాయిదాల పర్వం నడిచింది. గురువారం పార్లమెంటు ఆవరణలో ఎంపీల తోపులాటతో.. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తోసివేయడంతో తాము గాయపడినట్లు ఇద్దరు బీజేపీ ఎంపీల ఆరోపణలతో మరింత వివాదం నెలకొంది. చివరకు శుక్రవారం లోక్ సభ, రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడ్డాయి.
ఇక జేపీసీలో ఐదుగురు తెలుగు ఎంపీలకు చోటుదక్కింది. వీరిలో వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి, సీఎం రమేశ్, కె.లక్ష్మణ్ (బీజేపీ), వల్లభనేని బాలశౌరి (జనసేన), హరీశ్ బాలయోగి (టీడీపీ)లు ఉన్నారు. జమిలి బిల్లును జేపీసీకి పంపడంపై కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి మూజువాణి ఓటుతో ఆమోదం లభించింది.