రెండు తెలుగు రాష్ట్రాలకు బీజేపీ అధ్యక్షులు ఖరారు?
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కొత్త సారథుల నియామక ప్రక్రియ ఫైనల్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కొత్త సారథుల నియామక ప్రక్రియ ఫైనల్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. చాలా కాలంగా రెండు రాష్ట్రాల బీజేపీకి కొత్త అధ్యక్షులు వస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే పార్టీ జాతీయ అధ్యక్షుడి నియామకం పెండింగులో ఉండటంతో రాష్ట్రాల అధ్యక్షుల నియామకం కూడా పెండింగులోనే పెట్టారంటున్నారు.
ఈ నెలాఖరులోగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సివుంది. ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రిగా నియమితులయ్యారు. దీంతో జాతీయ అధ్యక్షుడిగా కొత్తవారిని నియమించాల్సివుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలో బీజేపీ అధ్యక్షుల పదవీకాలం కూడా పూర్తయింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు అనూహ్యంగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి అయిష్టంగానే ఈ పదవిలో కొనసాగుతున్నారు. దీంతో ఏడాది క్రితమే తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని భావించారు. అయితే అప్పట్లో పార్టీలో అనేక అంతర్గత సమస్యలు ఉండటంతో ఆ ప్రక్రియ అలా పెండింగులో ఉండిపోయింది. ప్రస్తుతం పార్టీలో అన్నీ సమస్యలు సమసిపోవడంతో కొత్త నాయకత్వం కోసం అధిష్టానం నేతలతో చర్యలు జరిపిందని అంటున్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బీసీలకు అవకాశం ఇవ్వాలని కమలనాథులు భావిస్తున్నారని అంటున్నారు. సమర్థుడైన బీసీ నేతకు అవకాశం ఇస్తే భవిష్యత్తులో పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని కేంద్ర నాయకత్వం ఆలోచనగా ఉందని చెబుతున్నారు. పార్టీలో అందరి అభిప్రాయాలను సేకరించిన అధిష్టానం చివరికి సీనియర్ నేత ఈటల రాజేందర్ పేరు ఖరారు చేసిందని అంటున్నారు. అదేవిధంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కూటమి పార్టీలతో సత్ససంబంధాలు కొనసాగించే నేత పేరు ఫైనల్ చేసినట్లు చెబుతున్నారు. ఇటు టీడీపీ, అటు బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్న విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పేరు ఫైనల్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ ఉంది. ప్రస్తుత అధ్యక్షురాలు పురందేశ్వరి మరోసారి పొడిగింపు కోరుతున్నారు. కేంద్ర మంత్రి పదవిని ఆశించిన పురందేశ్వరి ఆశలు ఫలించలేదు. బోర్న్ బీజేపీ సిద్ధాంతం వల్ల ఆమెకు పదవి దక్కలేదని అంటున్నారు. అయితే రాష్ట్రంలో పార్టీ పురోగతి కోసం కష్టపడిన తనకు తగిన గుర్తింపు ఉండాలని పురందేశ్వరి కోరుతున్నారు. దీంతో ఆమెను మరోసారి బీజేపీ అధ్యక్షరాలిగా కొనసాగించే అవకాశాలను అధిష్ఠానం పరిశీలిస్తుందంటున్నారు. కానీ ఆమె వ్యతిరేక వర్గం మాత్రం కొత్తవారిని పార్టీ అధ్యక్షురాలిగా తీసుకురావాలని తీవ్రంగా ప్రయత్నిస్తోందని అంటున్నారు.
దీంతో అందరి మధ్య సయోధ్య కుదిర్చిలే సుజనా చౌదరి పేరును దాదాపు ఫైనల్ చేసిందంటున్నారు. గతంలో టీడీపీలో పనిచేసిన సుజనాకు అటు టీడీపీ అధిష్ఠానంతోపాటు కమలం పెద్దలతోనూ మంచి సంబంధాలే ఉన్నాయి. సుజనా అయితే కూటమి ప్రభుత్వంతోనూ సమన్వయంతో పనిచేయగలుగుతారని బీజేపీ పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు. అయితే సీనియర్ నేత విష్ణువర్థన్ రెడ్డి తెలంగాణకు చెందిన ఇద్దరు నేతల ద్వారా పార్టీ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎమ్మెల్యే పార్థసారథి, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేర్లను ప్రత్యామ్నాయంగా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే అందరికన్నా ఎక్కువగా సుజనాకే అవకాశాలు ఉన్నాయని బీజేపీ వర్గాల సమాచారం. ఏదిఏమైనా రెండు మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల నియామకంపై ప్రకటన ఉండే అవకాశం ఉందని అంటున్నారు.