ఏడాది చివర్లో తెలుగు రాష్ట్రాలకు షాకిచ్చిన ప్రకృతి!

మరో ఐదు రోజులే. కాలగర్భంలో మరో ఏడాది కలిసిపోనుంది. నేటి వర్తమానం కాస్తా రేపటి గతం కానుంది.

Update: 2024-12-26 04:47 GMT

మరో ఐదు రోజులే. కాలగర్భంలో మరో ఏడాది కలిసిపోనుంది. నేటి వర్తమానం కాస్తా రేపటి గతం కానుంది. ఏడాది మొదట్లో.. చివర్లో ఏదో తెలియని కొత్త ఉత్సాహం అందరిని కమ్మేస్తుంటుంది. ఏడాది మొదట్లో కొత్త ఆశలు.. ఆలోచనలతో అందరూ ఎంతో ఎనర్జటిక్ గా ఉంటారు. తెలుగు వారైతే మరింత. ఎందుకంటే.. ఏడాది మొత్తంలోనే పెద్ద పండుగ వచ్చేది జనవరిలోనే. ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నప్పటికి.. ఊరికి వచ్చేందుకు సంక్రాంతికి మించిన సందర్భం మరొకటి ఉండదన్నట్లుగా ఫీల్ కావటమే.

ఎన్నో పండుగలు ఉన్నప్పటికి.. మూడు రోజుల పాటు చేసుకునే సంక్రాంతి పండుగ మిగిలిన వాటి కంటే సో స్పెషల్. అందునకే ఏడాదంతా కాసుక్కొని కూర్చుంటారు. అందుకే జనవరి వచ్చిందంటే అదోలాంటి హాయి మనసును పట్టేస్తుంది. అదే సమయంలో ఇయర్ ఎండింగ్ లోనూ చక్కిలిగింతల భావన కలుగుతుంది. కారణం.. వాతావరణం చలి.. చలిగా గిలి పెట్టటమే కాదు.. ఎంతో ఆశగా చూసే కొత్త ఏడాది వచ్చేస్తుండటమే.

మొత్తంగా ఏడాది ఎండింగ్ లోనూ.. ఏడాది ప్రారంభం ఎగ్జైటింగ్ గా ఉంటుంది. క్రిస్మస్ వచ్చేయటం.. వెళ్లిపోయిన నేపథ్యంలో.. కొత్త సంవత్సరానికి కౌంట్ డౌన్ షురూ అయినట్లే. ఇలాంటి వేళలో వాతావరణ నిపుణులు ఇప్పుడు కొత్త హెచ్చరిక జారీ చేశారు. రానున్న మూడు రోజులు గిలిగింతలు పెట్టే చలితో పాటు.. వణికించే గట్టి వానలు పడుతాయని హెచ్చరిస్తున్నారు. దీనికి కారణం బంగాళాఖాతంలో చోటు చేసుకున్న తీవ్ర అల్పపీడనమే.

దీని ప్రభావంతో తీరం వెంట తీవ్రమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా పేర్కొన్నారు. వర్షాల తీవ్రత దక్షిణ కోస్తా.. రాయలసీమ జిల్లాల్లో అల్ప పీడన ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. దక్షిణ కోస్తాలోని మత్స్య కారులు సముద్రంలోకి వెళ్లకూడదని వార్నింగ్ ఇస్తున్నారు. అల్ప పీడన కారణంగా తీరం వెంట ఈదురు గాలులు వీస్తాయని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. ఏడాది ఎండింగ్ గురించి ఎన్నో కలలు కంటున్న తెలుగు వారికి ప్రకృతి దిమ్మ తిరిగే షాకిచ్చిందని చెప్పాలి.

Tags:    

Similar News