తెలుగు సీఎంలు.. ఒకరు సోనియాను ఎదిరించి.. మరొకరు మెప్పించి

2004-14 మధ్య దేశంలో అత్యంత ప్రభావవంతమైన నాయకురాలు సోనియాగాంధీ. ఆ సమయంలో ప్రపంచంలోనే శక్తిమంతమైన నాయకురాలిగా పేరుగాంచారు.

Update: 2023-12-10 11:30 GMT

గమనించడంలో.. పోల్చి చూడడంలో కాస్త ఆలస్యమైంది కానీ.. ఈ అంశం ఇప్పటికీ ఆసక్తికరమే.. తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిల ప్రాథమిక నేపథ్యాన్ని గమనించినవారు.. 15 ఏళ్లలో ఇంత మార్పు జరిగిందేమిటా? అని ఆశ్చర్యపోకమానరు. కాలం ఎప్పుడూ ఒకేలా సాఫీగా సాగి ఉంటే.. వీరిద్దరూ ఇపుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉండేవారా? అనే ప్రశ్నలు రావడం సహజం. రాజకీయాలు కాస్త భిన్నంగా ఉంటాయి కానీ.. మరీ ఇంత భిన్నంగా ఉంటాయా? అనుకోకుండా ఉండలేరు.

వీర విధేయ వైఎస్ ఫ్యామిలీ..

ఎడుగూరి సందింటి (వైఎస్) ఫ్యామిలీ అంటే కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే వైఎస్ ఫ్యామిలీ. రాజశేఖర్ రెడ్డికి ఎమ్మెల్యే, ఎంపీ, పీసీసీ చీఫ్ రెండుసార్లు, సీఎల్పీ నాయకుడు ఇలా అన్ని పదవులూ ఇచ్చి ప్రోత్సహించింది కాంగ్రెస్. చివరగా రెండుసార్లు సీఎంనూ చేసింది. కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ అంటే వైఎస్ కు ఎంతటి అభిమానమో, గాంధీల కుటుంబం అంటే ఇంకెంత గౌరవమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నది వైఎస్ చివరి కోరిక. కానీ, 2009లో వైఎస్ అకాల మరణం పాలయ్యారు. ఆపై వైఎస్ కుమారుడు జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర విషయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రిగా ఉన్న సోనియాతో విభేదించడం, సొంతంగా పార్టీ పెట్టుకోవడం, 2019లో ఏపీకి సీఎం కావడం జరిగిపోయాయి.

సోనియాను ఎదిరించిన పేరు

2004-14 మధ్య దేశంలో అత్యంత ప్రభావవంతమైన నాయకురాలు సోనియాగాంధీ. ఆ సమయంలో ప్రపంచంలోనే శక్తిమంతమైన నాయకురాలిగా పేరుగాంచారు. అలాంటి వ్యక్తితో.. ఓదార్పు యాత్ర విషయంలో విభేదించి బయటకు వచ్చారు జగన్. సోనియాను నేరుగానే విమర్శించారు. దీనికిగాను కేసులను ఎదుర్కొని 16 నెలల పాటు జైల్లో ఉన్నారు. కాగా, 2004-14 మధ్య పదేళ్ల పాలనతో కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత నెలకొంది. అదే సమయంలో జగన్ ధైర్యాన్ని చూసి చాలామంది ఆకర్షితులయ్యారు. ఆ బలమే పునాదిగా పార్టీని స్థాపించిన జగన్ రాజకీయాల్లో తన దారి తాను చూసుకున్నారు. జగన్ కాస్త ఓపిక పట్టి ఉంటే మంచి భవిష్యత్తు ఉండేదని చాలామంది వ్యాఖ్యానించారు. కానీ, ఆయన అదేమీ లెక్కపెట్టకుండా బయటకు వచ్చారు.

నాడు సోనియాను విమర్శించి..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేపథ్యం ఇండిపెండెంట్ నుంచి మొదలై టీడీపీ మీదుగా కాంగ్రెస్ లో చేరారు. ఈ వ్యవధిలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. టీడీపీ తరఫున ఎమ్మెల్సీని కొనుగోలుకు ప్రయత్నించి ఇబ్బందుల్లో పడ్డారు. ఎమ్మెల్యేగా ఓసారి ఓడిపోయారు. మరీ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థుల ఆత్మహత్యలకు సోనియా గాంధీని తప్పుబట్టారు. ఆమెను బలిదేవత అంటూ విమర్శించారు. టీడీపీలో ఉంటూ తెలంగానం వినిపించేందుకు ప్రయత్నించారు. అలాంటి రేవంత్ రెడ్డి చివరకు 2017లో కాంగ్రెస్ లో చేరాల్సి వచ్చింది. 2021లో టీపీసీసీ అధ్యక్షుడు అయ్యారు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు. ఇదంతా సోనియా గాంధీ గుడ్ లుక్స్ లో లేకుండా సాధ్యమయ్యేది కాదనేది అందరికీ తెలిసిందే. పార్టీని నడపడంలో రేవంత్ చూపిన దూకుడు సోనియా సహా అగ్ర నేతలను మెప్పించబట్టే ఆయనకు సీఎం పదవి దక్కింది.

కొసమెరుపు: డిసెంబరు 9 సోనియా గాంధీ జన్మదినం. 2009లో ఈ రోజునే తొలిసారి తెలంగాణ ఏర్పాటు ప్రకటన వచ్చింది. 14 ఏళ్ల తర్వాత.. తెలంగాణలో కాంగ్రోస్ ప్రభుత్వం కొలువుదీరాక.. తొలిసారిగా సోనియా జన్మదినం శనివారం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సోనియా నాయకత్వాన్ని, తెలంగాణ ఏర్పాటులో ఆమె పట్టుదలను కొనియాడారు. 78 కేజీల కేక్ కటింగ్ తో గాంధీ భవన్ అయితే కళకళలాడింది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. దీనికి పూర్తి భిన్నంగా ఏపీలో పరిస్థితి ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, వైఎస్ కుమార్తె షర్మిల మాత్రం సోనియాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపడం గమనార్హం.

Tags:    

Similar News