టీడీపీ ప్రస్తుత పరిస్థితి బాబు పుణ్యమేనా...?
అందుకే నాడు టీడీపీ ఆందోళనలు ఎన్టీయార్ లేకపోయినా హిట్ అయ్యేవి. చంద్రబాబు జమానా వచ్చేసరికి అన్నింటికీ ఆయనే ఉండాలి
చంద్రబాబు పని రాక్షసుడు అని పేరు. ఆయనకు వేరే ఎవరో చేస్తే నచ్చదు. అన్నీ ఆయనే చేస్తారు ఎంతలా అంటే జిల్లా నాయకులు మండల నాయకులు కూడా చేసే పనులను కూడా ఆయనే ముందుండి చేస్తారు. చంద్రబాబు వన్ మాన్ ఆర్మీగా పార్టీని అలా నడిపిస్తూ వచ్చారు. ఇక్కడే జగన్ కి బాబుకు తేడా చూడాల్సి ఉంది.
జగన్ పార్టీ వారికి పని అప్పగిస్తారు. ఆయన ఎక్కడా ఇన్వాల్వ్ కారు. వారినే చేసుకుని రమ్మంటారు. అందుకే గడప గడపకు కార్యక్రమం అయినా మరోటి అయినా అధినాయకుడు లేకుండానే సాగుతోంది. కానీ టీడీపీలో ఆ పరిస్థితి లేదు. ప్రతీ సూచన బాబు నుంచే రావాలి. బాబు మాత్రమే దగ్గర ఉండి చేయాలి. అలా అలవాటు చేసి పారేశారు.
అంతే కాదు చంద్రబాబు ఎవరినీ పూర్తిగా నమ్మకుండా పార్టీలో రెండవ నాయకుడు లేకుండా చేసుకున్నారు అని అంటారు. ఎన్టీయార్ కి ఇద్దరు అల్లుళ్ళు ఉండేవారు. వారు నంబర్ టూ గా చలామణీ అయ్యేవారు. కాబట్టి ఏ ఇబ్బంది వచ్చినా వారే ముందుండి చేసేవారు.
అందుకే నాడు టీడీపీ ఆందోళనలు ఎన్టీయార్ లేకపోయినా హిట్ అయ్యేవి. చంద్రబాబు జమానా వచ్చేసరికి అన్నింటికీ ఆయనే ఉండాలి. నంబర్ టూ అన్న ప్రసక్తే లేదు. కొడుకు లోకేష్ చాలా కాలంగా పార్టీలో ఉన్న ఆయన నంబర్ టూ స్టేజికి రాలేకపోయారు అన్నది బాబు అరెస్ట్ అయిన ఇరవై రోజుల ఉదంతం తెలియచేస్తోంది.
అందుకే సమిష్టి నాయకత్వం పేరుతో పద్నాలుగు మందిని పెట్టి కమిటీని వేశారు. అయితే ఈ కమిటే ఒక పక్క ఉండగానే నారా బ్రాహ్మణి, నారా లోకేష్ పేరుతో అందోళన కార్యక్రమాలకు పిలుపు ఇస్తున్నారు. పార్టీకి ఒక స్ట్రక్చర్ ఉంది ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ఉన్నారు. శాసనమండలిలో విపక్ష నేతగా ఉన్న సీనియర్ మోస్ట్ నేత యనమల రామక్రిష్ణుడు ఉన్నారు. ఆయన ఈయనా ఇద్దరూ బీసీ నేతలే.
అయినా సరే ఎవరి ప్రమేయం పెద్దగా ఉండడం లేదు. ఆఖరుకు నారా బ్రాహ్మణి ఏపీలో లోకేష్ ఢిల్లీలో ట్వీట్ల ద్వారా పార్టీని నడిపిస్తున్నారా అన్న చర్చ అయితే వస్తోంది. చంద్రబాబు కూడా తన పరోక్షంలో పార్టీని ఎలా ఉంచాలో ఏ రోజూ ఆలోచించినట్లు లేదు అంటారు.
పార్టీలో రెండవ గ్రేడ్ లీడర్ షిప్ బలంగా ఉంటే ఇబ్బంది అనుకున్నారో లేక వన్ టూ టెన్ తానే ఉంటే చాలు అని భావించారో కానీ ఇపుడు టీడీపీ ఉన్న పరిస్థితి బాబు పుణ్యమే అంటున్నారు. టీడీపీ శ్రేణులకు నారా బ్రాహ్మణి మోత మోగ్గిద్దాం రండి అని పిలుపు ఇస్తున్నారు. ఆమెకు టీడీపీలో ఏ హోదా ఉందో ఎవరికీ తెలియదు. ఆమె చంద్రబాబుకు కోడలు మాత్రమే.
మరో వైపు చూస్తే ఆమెను ముందు పెట్టి రాజకీయం నడుపుతామని సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు లాంటి వారు అనడం టీడీపీలో ఉన్న నాయకత్వ లేమిని సూచిస్తోంది అని అంటున్నారు. సీనియర్లు చాలా మంది ఉన్నారు. ఎన్టీయార్ కాలం నుంచి మంత్రులుగా చేసిన వారు ఉన్నారు. వారంతా ఒక్కటిగా ఉండి పార్టీకి దిశా నిర్దేశం చేసే పరిస్థితి ఎందుకు లేదు అన్న చర్చ కూడా వస్తోంది. అయితే ప్రాంతీయ పార్టీలలో ఒక రకమైన అభద్రతాభావం ఉంటుంది. అందుకే బయట వారికి సులువుగా కీలక బాధ్యతలు ఇవ్వారు.
కొన్ని ఇచ్చినా అలంకారప్రాయంగా ఉంటాయి. కానీ సొంత కుటుంబ సభ్యులను కూడా నంబర్ టూ గా ఎందుకు తీర్చిదిద్దలేఅకపోయారు అన్నదే ఇపుడు చర్చకు వస్తోంది. లాలూ ప్రసాద్ ని సీబీఐ అరెస్ట్ చేసినపుడు తేజస్వి యాదవ్ చాలా చిన్నవాడు, పాతికేళ్ళ వాడు. కానీ పార్టీ పగ్గాలు అందుకు ఈ రోజు దాకా విజయపథాన నడిపిస్తున్నారు. యూపీలో ములాయం సీఎం గా ఉండగానే అఖిలేష్ యాదవ్ దూసుకుని వచ్చారు.
పొరుగున ఉన్న తెలంగాణాలో కేసీయార్ కి పెద్ద శ్రమ లేకుండా కుమారుడు కేటీయార్ అగ్ర స్థానంలో ఉంటూ అన్నీ చక్కబెడుతున్నారు. చంద్రబాబు కూడా అలాంటి ఆల్టర్నేషన్ ఒకటి ఏర్పాటు చేసుకుని ఉంటే ఈ పాటికి ఇబ్బందులు ఉండేవి కావని అంటున్నారు. మొత్తానికి మాకు బ్రాహ్మణి చాలు అని టీడీపీలో వందిమాగధులు అనుకోవచ్చు కానీ జనాల మెప్పు కావాలి. వారు ఆదరిస్తేనే ఎవరైనా నేతలు అయ్యేది. మరి బ్రాహ్మణి నిలదొక్కుకుంటుందా అన్నది చూడాల్సి ఉంది.