ఫాక్స్ కాన్.. పోటీ పడుతున్న రెండు తెలుగు రాష్ట్రాలు

దీంతో.. ఈ సంస్థ కోసం రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్న వేళ.. ఫాక్స్‌కాన్ ఎటువైపు మొగ్గు చూపుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Update: 2024-08-20 04:58 GMT

ఒకటి తర్వాత ఒకటిగా.. రెండు తెలుగు రాష్ట్రాలు ఒక పెద్ద సంస్థను తమ రాష్ట్రంలోపెట్టుబడులు పెట్టేందుకు.. వారి ఫ్యూచర్ ప్రాజెక్టులను తమ వద్దే ఏర్పాటు చేయాలంటూ పోటీ పడుతున్న వైనం ఆసక్తికరంగా మారింది.కొరియాకు చెందిన ఫాక్స్‌కాన్ కు ఉన్న ప్రత్యేకత గురించి తెలిసిందే. సెమీ కండక్టర్ల తయారీతో పాటు.. ఐఫోన్ల తయారీలో ఈ సంస్థ కీలకభూమిక పోషిస్తోంది. ఈ సంస్థకు చెందిన ప్రాజెక్టు ఒకటి హైదరాబాద్ మహానగర శివారులో సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థతో మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తుంటే.. ఇంకోవైపు ఏపీ కూడా రేసులోకి వచ్చేసింది.

 

నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్.. తన టూర్ లో భాగంగా ఫాక్స్ కాన్ టీంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సదరు సంస్థ ఛైర్రమన్ యాంగ్ లియూతో భేటీ అయి.. తమ ప్రభుత్వ పాలసీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తమ నగరంలో పెట్టుబడులు పెట్టాలని.. అనుమతులకు సంబంధించిన అంశాల్ని జెట్ స్పీడ్ తో పూర్తి చేస్తామని.. ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తామని చెప్పటం తెలిసిందే.

 

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ మహానగరంలో ఏర్పాటు చేయనున్న ఫ్యూచర్ సిటీకి సంబంధించిన వివరాల్ని వెల్లడిస్తే.. సదరు సిటీలో విద్యా.. వైద్యం.. క్రీడా.. ఎలక్ట్రానిక్స్.. ఎలక్ట్రికల్.. స్కిల్ డెవలప్ మెంట్ ఇలా అన్ని విధాలుగా డెవలప్ చేసేందుకు వీలుగా చేపట్టిన ప్లాన్ ను వివరించారు ముఖ్యమంత్రి రేవంత్. అంతేకాదు.. తాము స్టార్ట్ చేయనున్న స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్సిటీని ప్రారంభిస్తున్న వైనం గురించి వెల్లడించారు.

స్కిల్ వర్సిటీకి ఆనంద్ మహేంద్రను ఛైర్మన్ గా.. మరో పారిశ్రామికవేత్త శ్రీనివాసరాజును వైస్ ఛైర్మన్ గా నియమించిన వైనంతో పాటు.. ఓఆర్ఆర్.. ఆర్ఆర్ఆర్ కు ఉన్న సానుకూలతల్ని వివరించారు. రేవంత్ తో భేటీ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరానికి త్వరలో వస్తానని ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యాంగ్ లియూ వెల్లడించారు. సీఎం రేవంత్ విజన్ బాగుందంటూ అభినందించారు. ఇదిలా ఉంటే.. ఫాక్స్‌కాన్ ను ఏపీకి తీసుకెళ్లేందుకు వీలుగా ప్రయత్నాలు షురూ అయ్యాయి. తాజాగా ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్.. ఫాక్స్‌కాన్ సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు.

రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతుల్ని వేగంగా ఇవ్వటమే కాదు.. ప్రభుత్వం సైతం తన సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందన్న మాటను లోకేశ్ చెప్పారు. తాజా భేటీలో ఫాక్స్‌కాన్ భారత వ్యవహారాల ప్రతినిధి వి.లీతో భేటీ అయిన లోకేశ్.. సదరు సంస్థను ఏపీకి తీసుకెళ్లే ప్రయత్నాల్ని మొదలుపెట్టారు. దీంతో.. ఈ సంస్థ కోసం రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్న వేళ.. ఫాక్స్‌కాన్ ఎటువైపు మొగ్గు చూపుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News