తెనాలి తమ్ముళ్ల టికెట్ రచ్చ.. పెట్రోల్ బాటిళ్లతో వార్నింగ్!
ఈ క్రమంలో నేతలు మాట్లాడుతున్న వేళ.. తెలుగు తమ్ముళ్లు సయ్యద్ షావుల్.. వేణు అనే ఇద్దరు కార్యకర్తలు తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిళ్లను చూపిస్తూ.
గుంటూరు జిల్లా తెనాలిలో తెలుగుదేశం పార్టీ టికెట్ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ కే ఇవ్వాలంటూ తెలుగు తమ్ముళ్లు చేసిన హడావుడి.. వ్యవహరించిన తీరు సంచలనంగా మారింది. టీడీపీ - జనసేన పొత్తులో భాగంగా తెనాలి అసెంబ్లీ టికెట్ ను నాదెండ్ల మనోహర్ కు కేటాయిస్తారన్న మాట బలంగా వినిపించటం తెలిసిందే. నాదెండ్ల మనోహర్ ను గెలిపించుకోవటం తమ బాధ్యతగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం పలుమార్లు చెప్పటం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెనాలి అసెంబ్లీ స్థానాన్ని పొత్తుల్లో భాగంగా జనసేనకు ఇవ్వాల్సి ఉంటుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఇందుకు తగ్గట్లే స్థానిక తెలుగుదేశం పార్టీ బాధ్యులకు సమాచారం ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
అయితే.. పొత్తుల్లో భాగంగా తెనాలి సీటును ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనకు కేటాయించొద్దన్నది టీడీపీ సీనియర్ నేత.. మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ వర్గీయుల వాదన. మిగిలిన నియోజకవర్గాల సంగతి ఎలా ఉన్నా.. ఎట్టి పరిస్థితుల్లోనూ తెనాలి అసెంబ్లీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థే పోటీ చేయాలని.. పొత్తుల్లో భాగంగా జనసేనకు ఇవ్వటానికి ససేమిరా అంటున్నారు. ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు.. జనసేన అభ్యర్థిగా నాదెండ్ల బరిలోకి దిగటం ఖాయమన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్న వేళ.. బుధవారం తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు.
ఈ క్రమంలో నేతలు మాట్లాడుతున్న వేళ.. తెలుగు తమ్ముళ్లు సయ్యద్ షావుల్.. వేణు అనే ఇద్దరు కార్యకర్తలు తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిళ్లను చూపిస్తూ.. తెనాలి సీటును ఆలపాటికి ఇవ్వాలని లేకుంటే ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరికలకు దిగారు. తెనాలి సీటు ఆలపాటికి ఇవ్వాలి.. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావాలంటూ నినాదాలు చేస్తూ.. పెట్రోల్ బాటిళ్లలోని పెట్రోల్ ను తమ ఒంటి మీద పోసుకున్నారు. అక్కడే ఉన్న తెలుగు తమ్మళ్లు పలువురు.. వారిని వారించి.. వారి నుంచి పెట్రోల్ బాటిళ్లను లాక్కున్నారు. ఈ ఉదంతం స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది.