అమిత్ షా వ్యాఖ్యల దుమారం.. తమిళ హీరో ఏమన్నారంటే..

తాజాగా.. షా కామెంట్స్‌పై తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ స్పందించారు.

Update: 2024-12-19 10:10 GMT

పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపాయి. ఇప్పటికే షా వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తుండగా.. తాజాగా.. షా కామెంట్స్‌పై తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ స్పందించారు.

అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రతిపక్షాలు నిరసన బాటపట్టాయి. ఇప్పటికే పార్లమెంట్ భవనం ముందు ప్లకార్డులు పట్టుకొని ఆందోళనకు దిగాయి. అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో తమిళ హీరో, తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ గురువారం ‘ఎక్స్’ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. కొంత మందికి అంబేడ్కర్ పేరు నచ్చదు అని, ఆయన పేరు వింటేనే అలర్జి అని పేర్కొన్నారు. అంబేడ్కర్ రాజకీయ మేధావి అని, ఆయన ఎవరూ సాటి లేరని అభిప్రాయపడ్డారు. అంబేద్కర్.. అంబేద్కర్.. అంబేద్కర్.. అంటూ ఆయన పేరును మన హృదయాలతోపాటు పెదవులపై ఆనందంతో జపిస్తూనే ఉంటామని హీరో విజయ్ పేర్కొన్నారు.

రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ.. అంబేడ్కర్, అంబేడ్కర్, అంబేడ్కర్.. అని ఇన్నిసార్లు భగవంతుడి పేరు తలచుకుంటే ఏడేడు జన్మలు వారికి స్వర్గంలో స్థానం లభిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో షా వ్యాఖ్యలతో ఉభయ సభల్లోనూ నిరసనలు పెల్లుబికాయి. హోంమంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని పట్టుబట్టాయి. ఇదే క్రమంలో మోడీ అమిత్ షా వ్యాఖ్యలను సమర్థించారు. అంబేడ్కర్‌ను ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అవమానించిందో అమిత్ షా బహిర్గతం చేశారని వరుస ట్వీట్లలో తెలిపారు. హోంమంత్రి వాస్తవాలు చెబుతుంటూ కాంగ్రెస్ ఉలికి పడుతోందని పేర్కొన్నారు.

మరోవైపు.. ప్రతిపక్షాల రాజీనామా డిమాండ్‌పై షా కూడా స్పందించారు. తన రాజీనామా కాంగ్రెస‌కు సంతోషాన్ని ఇస్తుందనుుంటే రాజీనామా చేస్తానని చెప్పారు. కానీ.. ఇది ఎప్పటికీ సమస్యలను పరిష్కరించబోదని అభిప్రాయపడ్డారు. దశాబ్దకాలంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో కొనసాగుతున్న అంశాన్ని ప్రస్తావించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తన కుర్చీలో కొనసాగాలని అమిత్ షా పేర్కొన్నారు. మరోవైపు.. అంబేడ్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను అంబేడ్కర్ మనవడు ఖండించారు. ప్రకాశ్ అంబేడ్కర్ స్పందిస్తూ ఆయన వ్యాఖ్యలను విమర్శించారు. సభలోని అమిత్ షా చేసిన వ్యాఖ్యల టేప్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News