తండ్రిని పట్టించుకోని కొడుకులు... దిమ్మతిరిగే షాకిచ్చిన అధికారులు!

తమ గతాన్ని మరిచిపోయిన కొడుకులు, భవిష్యత్తును ఊహించుకోలేని కొడుకులు.. తమ వర్తమానంలో ఇలానే ప్రవర్తిస్తుంటారు!

Update: 2024-10-11 05:59 GMT

"మీ పిల్లలు ఎక్కడుంటారండీ"? ఓ పెద్దాయనకు మరో వ్యక్తి నుంచి ఎదురైన ప్రశ్న! దానికి సమాధానంగా... "పెద్దబ్బాయి అమెరికాలో, చిన్నబ్బాయి బ్రిటన్ లో, మూడోవాడు ఆస్ట్రేలియాలో, కూతురు కెనడాలో" ఉంటారని చెబుతారు ఆ పెద్దాయన! "మరి మీరెక్కడుంటున్నారండి..?" మరో ప్రశ్న! "వృద్ధాశ్రమంలో..!" పెద్దాయన సమాధానం!... అత్యంత దారుణమైన విషయాన్ని సరధాగా చెప్పుకున్నా కూడా ఇబ్బందిగా అనిపించే ఘటనలివి!

ఇటీవల కాలంలో వృధాప్యంలో తల్లితండ్రులను పట్టించుకోకుండా.. తమ బ్రతుకేదో తాము బ్రతుకుతూ.. దానికి న్యూక్లియర్ ఫ్యామిలీ అని ఓ పేరు పెట్టుకుని.. కన్నవారి బాధ్యతలు మరిచిపోయి బ్రతుకుతున్న పిల్లల కథలు ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తమ గతాన్ని మరిచిపోయిన కొడుకులు, భవిష్యత్తును ఊహించుకోలేని కొడుకులు.. తమ వర్తమానంలో ఇలానే ప్రవర్తిస్తుంటారు!

ఈ క్రమంలో గత నెలలో కూడా పెద్దపల్లి జిల్లా, పైడిచింత్లపల్లి గ్రామంలో ఓ తండ్రి విషయంలో కొడుకు ఇలానే చేశాడు. దీంతో... నేరుగా రంగంలోకి దిగిన కలెక్టర్ ఆ కుమారుడికి దిమ్మతిరిగేలా షాకిచ్చారు. ఇదే క్రమంలో తాజాగా వృద్ధాప్యంలో ఉన్న తన తండ్రి విషయంలో పైన చెప్పుకున్నట్లుగానే ప్రవర్తించిన ఓ కొడ్డుక్కి భారీ షాక్ ఇచ్చారు ఆర్డీవో. ఈ ఘటన సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి ప్రాంతంలో జరిగింది.

అవును... సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో ఓ తండ్రి రాజమల్లు పేరుతో ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించింది. అయితే ఆ ఇంటిని రాజమల్లు పెద్ద కుమారుడు తన భార్య పేరుతో రాయించుకున్నాడు. ఈ నేపథ్యంలో పెద్ద కుమారుడు చూడటం లేదు, ఇళ్లు తన అన్నకు పోయిందనో ఏమో చిన్నకుమారుడూ పట్టించుకోవడం లేదు. దీంతో... రాజమల్లు సుమారు 6 నెలలుగా బిక్షాటన చేసుకుంటున్నారు.

దీంతో ఈ విషయం అధికారులకు తెలియడంతో ఆర్డీవో రంగంలోకి దిగారు! తండ్రి పరిస్థితిని అర్ధం చేసుకున్న ఆయన... ఆ డబుల్ బెడ్ రూమ్ ఇంటిని తిరిగి తండ్రి పేరున కేటాయించారు. ఇదే సమయంలో ప్రతీ నెల రూ.2,000 ఇవ్వాలని కొడుకులను ఆదేశించారు.

Tags:    

Similar News