అప్పగింతలు పూర్తి.. వైసీపీలో ఆరుస్తంభాలాట.. !
అయినా.. జగన్ మాత్రం ఆ ఆరుగురి చుట్టూనే పార్టీని తిప్పేస్తున్నారు.
వైసీపీలో బాధ్యతలు అప్పగించడం పూర్తయిపోయింది. మొత్తం రాష్ట్రాన్ని ఆరు భాగాలుగా విభజించి.. ఆరుగురు కీలక నాయకులకు.. జగన్ అప్పగించేసిన విషయం తెలిసిందే. అయితే.. వీరిలో కొత్త మొఖాలు లేకపోవడం.. కొత్త సీసా అయినా.. పాతసారాతోనే నింపేయడం వంటి పరిణామాలు.. పార్టీలో తీవ్ర అసంతృప్తులకు దారి తీస్తున్నాయి. పైగా.. ఈ నేతలు.. ఎన్నికలకు ముందు అప్పగించిన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చకపోవడం.. వారిపై నేతల్లో ముసురుకున్న తీవ్ర అసంతృప్తి వంటివి పెను వివాదంగా మారాయి.
అయినా.. జగన్ మాత్రం ఆ ఆరుగురి చుట్టూనే పార్టీని తిప్పేస్తున్నారు. వారికే బాద్యతలు అప్పగించేశారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలను ప్రామాణికంగా తీసుకుని.. ఆరు జిల్లాలుగా రాష్ట్రాన్ని విభజించి.. చేసిన నియామకాలపై వైసీపీ నేతల్లో పెదవి విరుపులే కనిపిస్తున్నాయి. అయితే.. గత ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన వాళ్లే.. వారివారి జిల్లాల్లో ఘోరంగా ఓటములు తెచ్చి పెట్టారు. అయితే.. ఇప్పుడు జిల్లాలు మార్చినా మళ్లీ వారికే బాధ్యతలివ్వడంతో వైసీపీ క్యాడర్‌లో అసహనం.. ఆగ్రహం రెండూ కనిపిస్తున్నాయి.
+ ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలకు ఎంపీ మిథున్ రెడ్డిని నియమించారు. గతంలో మిధున్ రెడ్డి గోదావరి జిల్లాలకు ఇంచార్జ్ గా ఉన్నారు. కానీ.. ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లోనూ ఘోర పరాజయం పాలయ్యారు. మళ్లీ ఇప్పుడు మిథున్ రెడ్డిని కొత్త జిల్లాలకు అప్పగించారు.
+ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాల ఇంచార్జ్ గా నియమించారు. ఈఏడాది ఎన్నికల్లో అనంతపురం, చిత్తూరు జిల్లాలకు ఇంచార్జ్ గా ఉన్నారు. కానీ, అక్కడ కూడా ఘోర పరాభవం ఎదురైంది.
+ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డిని ఉమ్మడి కృష్ణా జిల్లా ఇంచార్జ్‌గా నియమించారు. ఇక్కడ భిన్నమైననేపథ్యం ఉన్న నాయకులు ఉన్నారు. పైగా కీలక నేత సామినేని ఉదయ భాను పార్టీ ఫిరాయించారు. జోగి రమేష్ కూడా .. జంపింగుల జాబితాలో చేరిపోయారు. ఇప్పుడు ఈయనకు కత్తిపై సవాలే.
+ వైవీ సుబ్బారెడ్డికి కడప, అనంతపురం, కర్నూల్ జిల్లాలకు ఇంచార్జ్ పదవి ఇచ్చారు. నిన్న మొన్నటి వరకు ఉత్తరాంధ్రలో తీవ్ర సెగను ఎదుర్కొన్నారు. పార్టీపైనా పట్టుకోల్పోయారు. ఇప్పుడు తీసుకువెళ్లి కీలక జిల్లాలకు ఇంచార్జ్‌ని చేశారు. అక్కడ ఢక్కాముక్కీలు తిన్న నాయకులు ఉన్నారు. వారు ఈయనను ఏమాత్రం ఖాతరు చేసే పరిస్థితి లేదని పార్టీలోనే చర్చ సాగుతోంది.
+ విజయసాయిరెడ్డికి ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం జిల్లాలకు ఇంచార్జిని చేశారు. గతంలో ఈయన చేసినప్పుడు.. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు ఈయనకు క్షణం కూడా పడేదికాదు. ఇలానే చాలా మంది నేతలు ఉన్నారు. ఇక, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు కూడా.. ఈయనంటే గిట్టదు. ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి.
+ మాజీ మంత్రి బొత్సకు ఉభయ గోదావరి జిల్లాల బాధ్యతలు ఇచ్చారు. ఈయనకు కూడా ఇక్కడ గట్టి సవాలే ఎదురు కానుంది. ఎలా చూసుకున్నా.. అన్నీ పాత ముఖాలే. మరి పార్టీ ఏమేరకు పుంజుకుంటుందో చూడాలి.