హైడ్రా దెబ్బకు అలుగు తెంపి నీటిని వదిలారు..!

హైడ్రా భయంతో ఇప్పటికే చాలా మంది తమ అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.

Update: 2024-09-24 07:05 GMT

హైడ్రా భయం ప్రజలను నిత్యం వెంటాడుతోంది. ముఖ్యంగా అక్రమ కట్టడాల్లో ఉంటున్న వారిలో రోజురోజుకూ ఆ భయం పెరిగిపోతోంది. చట్టం పరిధిలో అందరూ సమానమే అన్నచందంగా హైడ్రా దూసుకుపోతుండడంతో ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరికి ఉపద్రవం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. కంటి మీద కనుకు లేని రాత్రులు గడుపుతున్నారు.

హైడ్రా భయంతో ఇప్పటికే చాలా మంది తమ అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఆ మధ్య ఓ బీఆర్ఎస్ నేత కూడా అక్రమ షెడ్డును కూల్చివేయించారు. అలా చాలా మంది హైడ్రా తన పనిలోకి చేరకముందే స్వతహాగా కూల్చేస్తున్నారు. అలాంటి వారి లిస్టు కూడా రోజురోజుకూ పెరుగుతోంది. దీనికితోడు ఎక్కడ నీరు నిలిస్తే.. అక్కడ కబ్జా జరిగినట్లు హైడ్రా భావిస్తుందని కొందరు ప్రజలకు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. సరిగా అలాంటి సంఘటనే నార్సింగి పరిధిలో జరిగింది.

ఇళ్ల వద్ద నీరు నిలిస్తే అవి ఎఫ్‌టీఎల్ లేదంటే బఫర్ జోన్లలో నిర్మించి ఉంటారని హైడ్రా భావిస్తే ప్రమాదకరమని అక్కడి ప్రజలు ఈ విధంగా ఆలోచించారు. మంచిరేవుల వీరభద్రస్వామి గుట్టకు వెళ్లే మార్గంలో ఎకరం 29 గుంటల విస్తీర్ణంలో మల్లన్న కుంట ఉంది. అయితే.. గత రెండు రోజులుగా ఇక్కడ భారీ వర్షాలు కురస్తుండడంతో కుంట పూర్తిగా నిండిపోయింది. దాంతో మరింత నిండితే తమ ఇళ్లు నీట మునుగుతాయని అక్కడి ప్రజలు భయపడ్డారు.

కుంట పూర్తిస్థాయిలో నిండి నీరు ఇళ్లను చుట్టకముందే స్థానికులు పొక్లెయిన్ తీసుకొచ్చి అలుగును కొంత తొలగించారు. అలా నీటి బయటకు పంపించారు. ఆ తరువాత తొలగించిన అలుగును బోల్డర్లు, మట్టితో నింపేసి అక్కడి నుంచి సైలెంటుగా వెళ్లిపోయారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లినంది. దాంతో తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి అక్కడి అధికారులను ఆదేశించగా.. వీఆర్ఏలు అక్కడికి వెళ్లి గ్రామస్తులను విచారించారు. విచారణ పూర్తయ్యాక వారు నీటి పారుదల శాఖ అధికారులకు జరిగిన విషయాన్ని చెప్పారు. గండిపేట మండలం మంచిరేవుల గ్రామ పరిధిలో ఎకరం 29 గుంట్లో మల్లన్న కుంట విస్తరించి ఉన్నట్లు వారు వివరించారు. కుంట అలుగు ధ్వంసం చేసిన విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వివరించారు.

Tags:    

Similar News