మొత్తం 12.50 లక్షలు.. ఫైనల్ 1.30 లక్షలు.. వరల్డ్ కప్ ప్రేక్షకుల లెక్క ఇది
దీనికి బీసీసీఐ నిర్వహణా సామర్థ్యమే కారణం. అంతే స్థాయిలో ప్రేక్షకులు స్టేడియాలకు తరలివచ్చారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్ ఏకైక వేదికగా మూడు రోజుల కిందట ముగిసిన వన్డే ప్రపంచ కప్ విజయవంతమైంది. వాస్తవానికి ఈ కప్ నకు కేవలం వంద రోజుల ముందుగా షెడ్యూల్ ఖరారైంది. గతంలో ఎప్పుడైనా ఏడాది ముందుగా షెడ్యూల్ విడుదలయ్యేది. అయితే, కొవిడ్, వివిధ కారణాలతో ఈసారి ప్రణాళిక ఆలస్యమైంది. అయినప్పటికీ కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించి భారత్ తన ప్రత్యేకతను చాటుకుంది. దీనికి బీసీసీఐ నిర్వహణా సామర్థ్యమే కారణం. అంతే స్థాయిలో ప్రేక్షకులు స్టేడియాలకు తరలివచ్చారు.
రికార్డు సంఖ్యలో చూశారు..
భారత్ ప్రపంచ కప్ నకు ఆతిథ్యం ఇవ్వడం ఇది నాలుగోసారి. 1987, 1996, 2011లోనూ మనదగ్గర కప్ జరిగింది. అయితే, తొలి రెండుసార్లు పాకిస్థాన్, శ్రీలంకతో భాగస్వామి అయింది. 2011లో లంక, బంగ్లాదేశ్ కూ చాన్సిచ్చింది. ఈసారి మాత్రం ఒంటిచేత్తో నిర్వహణ చేపట్టింది. దీనికి ఆదరణ రూపేణా ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పట్టారు. అందుకనే వన్డే ప్రపంచకప్ ప్రేక్షకుల సంఖ్య పరంగా కొత్త రికార్డు సృష్టించింది. టోర్నీకి 12 లక్షల 50 వేల 307 మంది ప్రేక్షకులు హాజరయ్యారని ఐసీసీ ప్రకటించింది.
మనల్ని ఓడించినవారి రికార్డు బద్దలు
ప్రపంచ కప్ లో మొత్తం 10 వరుస విజయాలతో ఫైనల్ చేరి.. ఆస్ట్రేలియా చేతిలో ఓడింది టీమిండియా. దీనికి మరో విధంగా బదులు తీర్చుకుంది భారత్. అదెలాగంటే.. 2015లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఉమ్మడిగా ప్రపంచ కప్ నకు ఆతిథ్యం ఇచ్చాయి. ఈ కప్ ను 10,16,420 మంది స్టేడియాలకు వచ్చి వీక్షించారు. అయితే.. ఇక్కడో విచిత్రం జరిగింది. 2015 కంటే.. 2019 ప్రపంచ కప్ లో వీక్షకుల సంఖ్య చాలా తక్కువ. నాలుగేళ్ల కిందట 7,52,000 మంది మాత్రమే మైదానాలకు వచ్చారు.
భారత్ అంటే ఇది..
ఆస్ట్రేలియా పెద్ద దేశమే అయినా.. జనాభా చాలా తక్కువ. న్యూజిలాండ్ లో జనాభా అరకోటే. పర్యటకులు వెళ్లి చూస్తే గాని అక్కడి మైదానాలు నిండవు. కానీ, భారత్ లో అలా కాదు.. మధ్య శ్రేణి నగరంలో క్రికెట్ మ్యాచ్ నిర్వహించినా జనం పోటెత్తుతారు. మొన్నటి కప్ లో అదే జరిగింది. కాగా, ప్రపంచ కప్ లో భాగంగా మొత్తం 48 మ్యాచ్‌లు జరిగాయి. 12.50 లక్షల మంది హాజరయ్యారంటే.. ఒక్కో మ్యాచ్‌కు సగటున 26 వేల మంది వచ్చారు.
ఫైనల్ తీసేస్తే..
అహ్మదాబాద్ వేదికగా ప్రపంచ కప్ ఫైనల్ జరిగిన సంగతి తెలిసిందే. 1.30 లక్షల సామర్థ్యం ఉన్న ఆ స్టేడియం మొత్తం నిండిపోయింది. అంటే.. మొత్తం 12.50 లక్షల మంది వీక్షకుల్లో వీరే 1.30 లక్షలు ఉన్నారు. ఈ లెక్కన దాదాపు పదిశాతం ప్రేక్షకులు ఫైనల్ కే వచ్చారన్నమాట.