మెజారిటీల్లోనూ కుమ్మేశారు!
ఇక, టీడీపీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 135 సీట్లు దక్కిం చుకుని విజయం సాధించింది.
ఏపీలో జరిగిన ఎన్నికల్లో కూటమి పార్టీలు వీర విహారం చేసిన విషయం తెలిసిందే. గత నెల 13న జరిగిన ఎన్నికల ఫలితాలు తాజాగా మంగళవారం వచ్చాయి. ఈ నేపథ్యంలో కూటమిపార్టీలు.. టీడీపీ, జనసేన, బీజేపీలు దుమ్మురేపాయి. భారీ సంఖ్యలో సీట్లు దక్కించుకున్నాయి. బీజేపీ 8 చోట్ల విజయం దక్కించు కుంది. ఇది కనీ వినీ ఎరుగని విజయం. ఇక, టీడీపీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 135 సీట్లు దక్కిం చుకుని విజయం సాధించింది.
ఇక, చరిత్రను తిరగరాసిన జనసేన ఏకంగా పోటీ చేసిన 21 స్థానాల్లో విజయం దక్కించుకుంది. ఇలా.. కూటమి కట్టి కుమ్మేసిన పార్టీలకు.. ఇప్పుడు మెజారిటీ కూడా అలానే వచ్చింది. ప్రజలు తలుచుకుంటే.. ఏమైనా చేయగలరు.. అన్న నినాదం మరోసారి నిజమైంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన పల్లా శ్రీనివాసరావు ఈ సారి టీడీపీ నుంచి పోటీ చేసి విజయమే కాదు.. రాష్ట్రంలోనే అత్యంత భారీ మెజారిటీ దక్కించుకున్నా రు. ఏకంగా 95235 ఓట్ల మెజారిటీ సాధించారు.
ఎక్కడ నుంచి పోటీ చేసినా ఓటమి ఎరుగని నాయకుడిగా పేరు తెచ్చుకున్న గంటా శ్రీనివాసరావు భీమిలిలో చరిత్ర సృష్టించారు. ఈయన 92401 ఓట్ల మెజారిటీ దక్కించుకున్నారు. ఇక, అసలు గెలిస్తే చాలని వెయ్యి మంది దేవుళ్లకు దణ్ణం పెట్టుకున్న టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ తండ్రిని మించిన తనయుడిగా నిలిచారు. ఈయన 91413 ఓట్ల మెజారిటీ తో దూసుకుపోయారు.
పెందుర్తిలో జనసేన తరఫున పోటీ చేసిన పంచకర్ల రమేష్బాబు.. 81,870 ఓట్లతో విజయం దక్కించుకు న్నారు. అలాగే.. నెల్లూరు సిటీ నుంచి బరిలో ఉన్న నారాయణ కూడా.. 72,489 ఓట్లతో తణుకు నుంచి ఆరిమిల్లి రాధాకృష్ణ 72121 ఓట్ల మెజారిటీతో విజయం సొంతం చేసుకున్నారు. అలానే.. తొలిసారి విజయం అందుకున్న పంతం నానాజీ జనసేన తరఫున పోటీ చేసి 72040 ఓట్లు సాధించారు.
రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో తొలిసారి పోటీ చేసిన ఆదిరెడ్డి శ్రీనివాస్ 71404 ఓట్లు, పిఠాపురం నుంచి గెలిచి .. వైసీపీ వ్యూహాలను అడ్డుకున్న పవన్ కల్యాణ్ కూడా.. 70279 ఓట్ల మెజారిటీ దక్కించుకున్నారు. మొత్తంగా చూస్తే.. ఇదొక అరుదైన ఎన్నిక.. ఈ మెజారిటీ బహుశ మళ్లీ వీరే పోటీ చేసినా.. దక్కుతుందని చెప్పలేని ఎన్నిక అనడంలో సందేహం లేదు.