రూ.250 కోట్లు ఖర్చు అయిన క్రికెట్ స్టేడియం... ప్రత్యేకతలివే!

ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొంటుండగా.. ఈ మెగా టోర్నీలో భారత్ తన లీగ్ మ్యాచ్ లను యూఎస్ లోనే ఆడనుంది.

Update: 2024-06-01 16:30 GMT

ఆదివారం (జూన్ 2) నుంచి ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ టోర్నమెంట్ ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరగనున్న ఈ టీ-20 ప్రపంచ కప్ - 2024 కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది ఐసీసీ. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొంటుండగా.. ఈ మెగా టోర్నీలో భారత్ తన లీగ్ మ్యాచ్ లను యూఎస్ లోనే ఆడనుంది.


ఇక, తొలిసారిగా అగ్రరాజ్యం అమెరికాలో టీ-20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ జరనుండటంతో ఇక్కడ భారీ స్టేడియాలను నిర్మించింది ఐసీసీ. ఈ క్రమంలో అత్యంత ఆకర్షణీయంగా మారింది న్యూయార్క్ లోని నసావూ కౌంటీ క్రికెట్ స్టేడియం. దీని నిర్మాణం జెట్ స్పీడ్ తో కేవలం మూడు నెలల్లో నిర్మించగా.. ఇప్పుడు టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ స్టేడియంపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నాడు.


అవును... అమెరికాలో జరగనున్న టీ-20 వరల్డ్ కప్ టోర్నీలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది నసావూ కౌంటీ క్రికెట్ స్టేడియం. న్యూయార్క్ లోని ఈస్ట్ మేడోలో ఉన్న ఐసెన్ హోవర్ పార్క్ లోని ప్రాంతంలో ఈ స్టేడియం నిర్మించారు. ఈ క్రమంలో.. ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్ అంబాసిడర్ గా ఉన్న ప్రఖ్యాత జమైకన్ అథ్లెట్ ఉస్సేన్ బోల్ట్ ఈ స్టేడియాన్ని ప్రారంభించారు.

ఈ ప్రపంచ స్థాయి పిచ్ సుమారు 33,616 చదరపు మీటర్లు ఉండగా... దీని బౌండరీ పొడవు 65 నుంచి 70 మీటర్ల వరకూ ఉంటుంది. ఇక ఈ స్టేడియంలోని బౌలింగ్ ఎండ్ లకు నార్త్ పెవిలియన్ ఎండ్ మరియూ సౌత్ పెవిలియన్ ఎండ్ అని పేర్లు పెట్టారు. ఈ స్టేడియం నిర్మాణానికి ఏకంగా రూ.250 కోట్లు ఖర్చు చేశారంట.

ఇక సుమారు 34,000 సిట్టింగ్ కెపాసిటీ ఉన్న ఈ స్టేడియంలో డ్రాప్ – ఇన్ పిచ్ లను ఇన్ స్టాల్ చేశారు. ఇక ఇక్కడ టిక్కెట్ల ధర విషయానికొస్తే... ప్రారంభ ధర $90 కాగా... స్టాండర్ $200, ప్రీమియం టిక్కెట్ల ధర $300 గా ఉంది. ఇదే క్రమంలో బౌండరీ సీట్ల ధర $600 కాగా.. పెవిలియన్ క్లబ్ (సౌత్) సీట్ల ధర $750 గా నిర్ణయించారు.

అదేవిధంగా... ప్రీమియం క్లబ్ లాంజ్ (నార్త్ & సౌత్), కార్నర్ క్లబ్ సీట్ల ధర $1,000 గా నిర్ణయించగా... కాబానా సీట్ల ధర $1,350 గా నిర్ణయించారు.

రోహిత్ శర్మ ప్రశంసలు!:

ఈ నసావు కౌంటీ క్రికెట్ స్టేడియంలోని ప్రాక్టీస్ సమయంలో రోహిత్ శర్మ స్పందించారు. ఇందులో భాగంగా ఈ స్టేడియంలో నిర్మాణంలో చేసిన కృషిని కొనియడారు. ఇక్కడ ఏర్పాట్లు సూపర్ గా ఉన్నాయంటూ ప్రశంసల జల్లులు కురిపించారు. ఇదే సమయంలో.. ఈ ప్రధాన ఈవెంట్ కోసం సమయానికి ఈ స్టేడియంను సిద్ధం చేయడానికి శ్రద్ధగా పనిచేసిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News