ఇక నిశ్శబ్ద 'యుద్దం'

ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించడానికి వీలులేదు.

Update: 2024-05-11 17:12 GMT

ఎన్నికల ప్రచారానికి ఈ సాయంత్రంతో తెర పడింది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఈ సాయంత్రం 6 గంటల నుంచి మే12వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు సైలెన్స్ పీరియడ్ గా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించడానికి వీలులేదు.

రోడ్ షో లు, సమావేశాలు, సోషల్ మీడియా ప్రచారాలు, పత్రికా ప్రకటనలు అన్నీ నేటితో ఆగిపోతాయి. బల్క్ ఎస్ఎంఎస్ లపై కూడా నిషేధం విధిస్తూ ఎన్నికల కమీషన్ ఆదేశాలు జారీచేసింది.

స్థానికేతరులు సాయంత్రం 6 గంటల తర్వాత అయా నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాలి.

తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ స్థానానికి ఉప ఎన్నికతో పాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 శాసనసభ స్థానాలకు, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

మార్చి 16న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించడంతో మొదలైన ఎన్నికల ప్రచారం దాదాపు 60 రోజుల తర్వాత ముగిసింది. మే 13వ తేదీన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఒకే రోజు పోలింగ్ జరగనుంది. రాజకీయ పార్టీల అభ్యర్థన మేరకు ఎన్నికల సంఘం పోలింగ్ సమయాన్ని ఒక గంట పాటు సాయంత్రం 6.00 గంటల వరకు పొడిగించింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఎన్నికల ఆంక్షలు ఇవీ :

ఐదుగురికి మించి రోడ్డు పైకి రాకూడదు.

మైక్రోఫోన్లు, స్పీకర్ల ద్వారా పాడటం, ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం నిషేధం.

బహిరంగ ప్రదేశాల్లో షామియానాలు, పందిరి వంటి నిర్మాణాలు అనుమతించరు.

వ్యక్తులు, సంఘాల మధ్య ద్వేషాన్ని రెచ్చ గొట్టే ప్లకార్డులు, చిత్రాలు, సంకేతాలను ప్రదర్శించడం నిషేధం.

కర్రలు, తుపాకులు, మారణాయుధాలతో కూడిన జెండాలను పోలింగ్ కేంద్రాల నుంచి కిలో మీటరు దూరం వరకు తీసుకెళ్ల కూడదు.

ఆత్మ రక్షణ కోసం కర్రలు, తుపాకులు, మారణాయుధాలు వాడడాన్ని నిషేధం.

మద్యం దుకాణాలు, బార్లు మూసి వేయాలి

Tags:    

Similar News