మల్లన్న మాటల తీన్మార్.. రేవంతే తెలంగాణకు చివరి ఓసీ సీఎం

అయితే, కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినా.. ఆయన తన దూకుడు తగ్గించుకోవడం లేదు. బీసీ వాదం వినిపిస్తూనే.. ప్రభుత్వంపైనా విమర్శలు చేస్తున్నారు.

Update: 2024-09-23 12:13 GMT

తదుపరి ఎన్నికల్లో బీసీలే సీఎంలు.. అవసరమైతే ఎమ్మెల్సీ పదవి పోతుంది.. మళ్లీ చానెల్ నడుపుకొంటా.. ఇవీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు. యూట్యూబ్ చానల్ ద్వారా కేసీఆర్ ప్రభుత్వాన్ని చీల్చిచెండాలి అత్యంత పాపులర్ అయిన మల్లన్న.. రెండోసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి ఇటీవల గెలుపొందారు. అయితే, కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినా.. ఆయన తన దూకుడు తగ్గించుకోవడం లేదు. బీసీ వాదం వినిపిస్తూనే.. ప్రభుత్వంపైనా విమర్శలు చేస్తున్నారు.

తాజాగా జరిగిన కార్యక్రమంలో తెలంగాణకు రేవంత్‌రెడ్డే చివరి అగ్ర వర్ణ (ఓసీ) సీఎం అని అన్నారు. 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణకు బీసీ నాయకుడు ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్యానించారు. గత నెలలో వరంగల్ లో జరిగిన కార్యక్రమంలోనూ మహా అయితే ఎమ్మెల్సీ పదవి పోతుంది.. ఏమవుద్ది అని వ్యాఖ్యానించారు. ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేసేందుకు అంచనాలను రూ.4,500 కోట్లకు పెంచారని.. దీనికి గత పాలకులు చేసిన తప్పులు కారణం అంటున్నారని.. మరి నాటి ప్రభుత్వంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు కదా? అని నిలదీశారు. ఓ సందర్భంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపైనా విమర్శలు చేశారు.

42 శాతం రిజర్వేషన్లపైనా స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దీనిని అమలు చేయాల్సిందేనని సొంత పార్టీని డిమాండ్ చేస్తున్నారు మల్లన్న. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అఖిలపక్ష, బీసీ కుల సంఘాల సదస్సులోనే ఆయన ఈ మాటలన్నారు. సీఎం దగ్గర ఉన్న ఫైల్ పై త్వరలో సంతకం పెడతారని భావిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్న మల్లన్న చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు ఆయుధంగా మారే అవకాశం ఉంది.

రెడ్ల ఆధిపత్యంలో..

తెలంగాణలో సామాజికంగా రెడ్ల ఆధిపత్యం ఎక్కువ. కాంగ్రెస్ పార్టీలో కూడా. ఇలాంటి సమయంలో మల్లన్న కాంగ్రెస్ లో ఉంటూ తెలంగాణ రాష్ట్రం బీసీ రాజ్యంగా మారబోతుందని అంటన్నారు. 42 శాతం రిజర్వేషన్ల కల్పనతో పాటు.. సమగ్ర కులగణనను చేయించే బాధ్యత తనదేనని చెప్పుకొచ్చారు. అది జరగకపోతే.. బాధ్యత వహిస్తానని ప్రకటించారు. రాష్ట్రంలో మొదటగా.. ఈడబ్ల్యూఎస్ కోటాను నిర్ణయించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఓసీలు 6.98 శాతం మాత్రమేనని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద నూటికి ఒకటి లేదా ఒకటిన్నర శాతం మాత్రమే దక్కాలని.. కానీ వాళ్లకు 10 శాతం దక్కుతుందని పేర్కొన్నారు. మిగతా 9 శాతం రిజర్వేషన్లు బీసీల నుంచి ఎత్తుకుపోతున్నారని అన్నారు.

నాయకుడిగా ఎదగాలనేనా?

సొంతంగా పార్టీనీ స్థాపించిన మల్లన్న ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ. అయితే, ఆయన అడుగులు సొంతంగా ఎదిగే దిశలో ఉన్నాయని అంటున్నారు. బీసీ జనాభా అధికంగా ఉండే తెలంగాణలో ప్రముఖ నాయకుడిగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. రేవంత్ నాయకత్వాన్ని నిలదీస్తూనే, పార్టీలోని అగ్రకుల సీనియర్ నాయకులను విమర్శలు చేస్తున్నారు.

తెరవెనుక ఎవరైనా ఉన్నారా?

మల్లన్నను ఎవరైనా వెనక ఉండి నడిపిస్తున్నారా? అనే అనుమానాలూ కలుగుతున్నాయి. కాంగ్రెస్ లోని నాయకులే తమ ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు ఆయనను వాడుకుంటున్నారా? అనే సందేహాలూ వస్తున్నాయి. అయితే, మల్లన్నది ఒకరికి లొంగే స్వభావం కాదని కొందరు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండే స్వేచ్ఛను ఆయన వాడుకుంటున్నారని మరికొందరు పేర్కొంటున్నారు.

Tags:    

Similar News