Begin typing your search above and press return to search.

ఇదెక్కడి పితలాటకం భార్యలను కాపురానికి పంపాలని భర్తల ధర్నా!

ఇది ఏకంగా జిల్లా ఎస్పీ, కలెక్టర్‌ దృష్టికి కూడా వెళ్లడం విశేషం.

By:  Tupaki Desk   |   4 Aug 2024 6:16 AM GMT
ఇదెక్కడి పితలాటకం   భార్యలను కాపురానికి పంపాలని భర్తల ధర్నా!
X

సాధారణంగా భర్త, అత్తమామలు తనను అత్తవారింటికి (కాపురానికి) రానీయడం లేదని భార్యలు, వారికి మద్దతుగా బంధువులు ధర్నాలు చేస్తుంటారు.. నిరసనలు వ్యక్తం చేస్తారు.

కానీ ఇక్కడ జరిగిన ఘటన విచిత్రం. తమ భార్యలను కాపురానికి పంపాలంటూ భర్తలే ధర్నాలు చేసిన ఉదంతం ఆంధ్రప్రదేశ్‌ లో చోటు చేసుకుంది. ఇది ఏకంగా జిల్లా ఎస్పీ, కలెక్టర్‌ దృష్టికి కూడా వెళ్లడం విశేషం. మరి ఈ జిల్లా ఉన్నతాధికారులు తమ భార్యల కోసం ధర్నా చేస్తున్న ఇద్దరు భర్తల కోసం ఏం న్యాయం చేస్తారో వేచిచూడాల్సిందే.

వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌ లో ఏలూరుకు చెందిన బూరుగడ్డ శ్రీనివాస్‌ రామానుజ అయ్యంగార్‌ కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ క్రమంలో పెద్ద కుమార్తెను పవన్‌ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఆమెకు ఒక కుమార్తె పుట్టింది. ఈ క్రమంలో పెళ్లయినే రెండేళ్లకే తన కుమార్తెను రామానుజ అయ్యంగార్‌ ఇంటికి తీసుకొచ్చేశాడు అని ఆరోపణ . అప్పటి నుంచి ఆమెను కాపురానికి పంపడం లేదు అని అంటున్నారు.

అలాగే రామానుజ అయ్యంగార్‌ తన రెండో కుమార్తెను శేషసాయి అనే వ్యక్తికిచ్చి వివాహం జరిపించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే బంధుమిత్రుల సమక్షంలోనే అట్టహాసంగా పెళ్లి జరిగింది. ఆమెను కూడా ఏవో కారణాలతో పెళ్లయిన నెల రోజులకే రామానుజ అయ్యంగార్‌ ఇంటికి తీసుకొచ్చేశాడు అనేది మరో అల్లుడి ఆరోపణ.

ఇలా ఇద్దరు కుమార్తెలను అప్పటి నుంచి తన ఇంటిలోనే పెట్టుకున్నాడు. ఇద్దరు అల్లుళ్లు తమ భార్యలను పంపాలని ఎన్నిసార్లు కోరినా, మొత్తుకున్నా పంపడం లేదు అని ఆయన మీద అల్లుడులు చేస్తున్న పెద్ద ఆరోపణ. అంతేకాకుండా తన అల్లుల్లిద్దరూ తమ కుమార్తెలను వేధిస్తున్నారని.. వారిపైనే తప్పుడు కేసు పెట్టాడని అల్లుల్లిద్దరూ ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలో తమ భార్యలను కాపురానికి పంపని తమ మామపై చర్యలు తీసుకోవాలని.. అలాగే తమ భార్యలను కాపురానికి పంపాలని అల్లుళ్లు పవన్, శేషసాయి ఏకంగా ఏలూరు జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నాకు దిగారు.

ఒక పెద్ద ఫ్లెక్సీని కూడా అల్లుల్లిద్దరూ ఏర్పాటు చేసుకున్నారు. ‘ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు అయ్యాక కాపురానికి పంపకుండా తిరిగి అల్లుళ్లపై కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్న శాడిస్ట్‌ మామ బి.కె.శ్రీనివాస రామానుజ అయ్యంగార్‌ పై చర్యలు తీసుకోవాలి. ఇట్లు మోసపోయిన అల్లుళ్లు, ఏలూరు’ అని ఆ ఫ్లెక్సీపై రాశారు.

ఏకంగా ఏలూరు జిల్లా కలెక్టరేట్‌ ఎదురుగానే ధర్నాకు దిగడంతో ఇది కలెక్టర్‌ వరకు చేరింది. మరి ఆయన ఈ సమస్యకు ఏ పరిష్కారం చూపుతారో వేచిచూడాల్సిందే.