చంద్రబాబుకిచ్చిన మధ్యంతర బెయిల్ అంటే ఏమిటి... కండిషన్స్ ఇవేనా?

భారతదేశంలో మధ్యంతర బెయిల్ అనేది తాత్కాలికంగా, స్వల్ప కాలానికి మంజూరు చేయబడిన ఒక రకమైన బెయిల్.

Update: 2023-10-31 06:22 GMT

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు 51 రోజుల నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు కంటి ఆపరేషన్ చేయించాల్సి ఉందని గతకొన్ని రోజులుగా కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై బాబు తరుపు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సీఐడీ తరుపు న్యాయవాదుల నుంచి కూడా పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కాలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాబుకు ముందస్తు బెయిల్ మంజూరైంది!

అవును... స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో అరెస్టైన చంద్రబాబుకు అనారోగ్య కారణాల రీత్యా నాలుగు వారాల పాటు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలరీత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిలు మంజూరు చేయాలని చంద్రబాబు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ పై సోమవారం విచారణ పూర్తిచేసిన హైకోర్టు.. నేడు తీర్పు వెలువరించింది.

ఈ క్రమంలో కోర్టు పలు షరతులు విధించిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... ఈ కేసును ఏ విధంగా ప్రభావితం చేయడానికి వీల్లేదని.. మీడియా, ఏ విధమైన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని.. కేవలం ఆస్పత్రి మినహా మరేయితర కార్యక్రమాల్లో పాల్గొనరాదని.. బెయిల్‌ గడువు ముగిసిన అనంతరం నవంబర్‌ 24వ తేదీ సాయంత్రంలోపు కోర్టులో లొంగిపోవాలని ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది! ఈ క్రమంలో నవంబర్‌ 10న రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌ పై హైకోర్టు విచారణ చేపట్టనుంది.

ఏమిటీ మద్యంతర బెయిల్?:

భారతదేశంలో మధ్యంతర బెయిల్ అనేది తాత్కాలికంగా, స్వల్ప కాలానికి మంజూరు చేయబడిన ఒక రకమైన బెయిల్. సాధారణ బెయిల్‌ పై తుది నిర్ణయం పెండింగ్‌ లో ఉన్నప్పుడే కోర్టు దీనిని మంజూరు చేస్తుంది! సాధారణంగా ఒక నిందితుడు రెగ్యులర్ బెయిల్ పొందలేనప్పుడు లేదా బెయిల్‌ పై తుది నిర్ణయం తీసుకునే ముందు కేసు యొక్క మెరిట్‌ లను పరిశీలించడానికి కోర్టుకు ఎక్కువ సమయం అవసరమైనప్పుడు ఈ మధ్యంతర బెయిల్ మంజూరు చేయబడుతుంది.

ఈ మధ్యంతర బెయిల్ షరతులు సాధారణ బెయిల్‌ తో కొంతవరకూ సమానంగా ఉంటాయి. అయితే... ఈ బెయిల్ అమలులో ఉన్న సమయంలో నిందితుడు వాటిని తప్పక పాటించాల్సి ఉంటుంది.

కాగా... నంద్యాలలో సెప్టెంబర్‌ 9న చంద్రబాబును సీఐడీ అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన్ను విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్‌ విధించింది. దీంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో ఆయన ఆ జైలులోని స్నేహ బ్లాక్ లో ప్రత్యేక సదుపాయాల మధ్య గత 52 రోజులుగా అక్కడే ఉన్నారు.

ఈ సమయంలో చంద్రబాబుకు ఇంటినుంచే భోజనం, మందులు అందించేందుకు కొర్టు అనుమతి ఇచ్చింది. ఈ విషయంలో ప్రభుత్వం తరుపున ఎలాంటి అభ్యంతరాలూ రాలేదు! ఇదే సమయంలో చర్మ వ్యాదుల సమస్య కారణంగా ఇటీవల కోర్టు ఆదేశాలతో జైలు అధికారులు ఏసీ కూడా ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News