ఈ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఎన్నేసి కోట్లకు అధిపతులంటే...?

ఈ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రిచ్చెస్ట్ అభ్యర్థుల జాబితా తెరపైకి వచ్చింది.

Update: 2024-04-23 06:43 GMT

ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ.. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల సందడి నెలకొంది. ఈ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నామినేషన్ల పర్వ కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలు పార్టీల నేతలు నామినేషన్ దాఖలులో భాగంగా అఫిడవిట్ లో తమ ఆస్తులు, అప్పులు, కేసులు, మొదలైన వివరాలు వెల్లడిస్తున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రిచ్చెస్ట్ అభ్యర్థుల జాబితా తెరపైకి వచ్చింది.

అవును... తాజాగా ఎన్నికల సీజన్ లోని నామినేషన్స్ లో రిచ్చెస్ట్ అభ్యర్థులు తెరపైకి వచ్చారు. వీరిలో... గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అత్యధికంగా రూ.5,785 కోట్ల ఆస్తులను ప్రకటించారు. దీంతో... ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభ్యర్థుల్లో ఈయనే రిచ్చెస్ట్ పర్సన్ అనే చర్చ తెరపైకి వచ్చింది. యూఎస్ లో వైద్య వృత్తిలో కొనసాగిన ఆయన... దీంతోపాటు అనేక వ్యాపారాలు చేసి సక్సెస్ అయ్యారు.

ఈ సమయంలో అన్ని వేల కోట్ల ఆస్తులతో పాటు ఖరీదైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారును కలిగి ఉండటంతో పాటు, అతను రెండు బెంజ్ కార్లు, టెస్లాను కలిగి ఉన్నాడు. అతను టెక్సాస్ - హైదరాబాద్‌ లో విస్తృతమైన ఆస్తులను కలిగి ఉండటంతోపాటు.. అమెరికాలోని జేపీ మోర్గాన్ బ్యాంక్‌ లో గణనీయమైన డిపాజిట్లను నిర్వహిస్తున్నారు! ఇదే క్రమంలో... అతని భార్యకు రెండున్నర కిలోల బంగారం ఉంది!

ఇదే సమయంలో తెలంగాణలో కొండా విశ్వేశ్వర రెడ్డి రూ.4,564 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. ఇక ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని కీలక నేతలు ఉన్నారు. వీరిలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తన కుటుంబ ఆస్తుల విలువ రూ.931 కోట్లుగా ప్రకటించారు. ఈయన తర్వాత అదేపార్టీకి చెందిన నారాయణ సుమారు ఎనిమిది వందల పాతిక కోట్ల రూపాయల ఆస్తులను ప్రకటించారు.

ఇందులో భాగంగా... నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి, మాజీమంత్రి పొంగూరు నారాయణ, రమాదేవి దంపతుల మొత్తం ఆస్తి రూ.824.05 కోట్లుగా ప్రకటించారు. ఇందులో... నారాయణ పేరిట చరాస్తులు రూ.78.66 కోట్లు, రమాదేవి పేరిట చరాస్తులు రూ.100.87 కోట్లు కాగా... ఆయన స్థిరాస్తులు రూ.207.50 కోట్లు.. రమాదేవి స్థిరాస్తులు రూ.437.02 కోట్లుగా ఉన్నాయి. ఇదే సమయంలో ఈయనపై వరకట్న వేధింపులు, విద్యార్థి ఆత్మహత్య, రాజధాని అమరావతి వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన కేసులున్న సంగతి తెలిసిందే!

ఇదే సమయంలో... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ ఆస్తులు రూ.757 కోట్లకు చేరుకున్నాయి! అనంతరం నెల్లూరు లోక్‌ సభ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి కుటుంబ ఆస్తులు రూ.716.31 కోట్లుగా ప్రకటించారు. వీటిలో ప్రభాకర్‌ రెడ్డి పేరుతో రూ.639.26 కోట్ల చర, స్థిరాస్తులుండగా.. ఆయన భార్య ప్రశాంతి రెడ్డి పేరుపై రూ.77.05 కోట్లున్నాయి.

ఇక మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ కుటుంబ ఆస్తులు రూ.542.17 కోట్లుగా వెల్లడించారు. ఇందులో లోకేష్ పేరిట చరాస్తులు రూ.341.68 కోట్లు, స్థిరాస్తులు రూ.92.31 కోట్లు, అప్పు రూ.18.44 కోట్లు ఉండగా... భార్య బ్రాహ్మణికి రూ.45.06 కోట్ల చరాస్తులు, రూ.35.59 కోట్ల స్థిరాస్తులు, రూ.14.34 కోట్లు అప్పు ఉన్నాయి. వీరి కుమారుడు దేవాన్ష్‌ చరాస్తులు రూ.7.35 కోట్లు కాగా, స్థిరాస్తులు రూ.20.17 కోట్లుగా వెల్లడించారు.

ఇదే క్రమంలో... విశాఖపట్నం లోక్‌ సభ టీడీపీ అభ్యర్థి ఎం. శ్రీభరత్‌, భార్య తేజస్విని పేరిట ఆస్తుల విలువ రూ.393.41 కోట్లుగా వెల్లడించారు. భరత్‌ పేరిట రూ.16.89 కోట్లు, తేజస్విని పేరుతో రూ.48.36 కోట్ల చరాస్థులు ఉండగా... శ్రీభరత్‌ పేరున రూ.183.95 కోట్లు, భార్య పేరుతో రూ.44.20 కోట్ల స్థిరాస్తులు ఆస్తులున్నాయి!

ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్‌ కుటుంబ ఆస్తులు రూ.188 కోట్లుగా వెల్లడించారు. ఆత్మకూరు వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌ రెడ్డి కుటుంబ ఆస్తుల విలువ రూ.209.22 కోట్లుగా ప్రకటించారు. రాజంపేట లోక్‌ సభ వైసీపీ అభ్యర్థి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, లక్ష్మీదివ్య దంపతుల చరాస్తులు రూ.47.54 కోట్లు, స్థిరాస్తులు రూ.163.79 కోట్లు, రుణాలు రూ.54.44 కోట్లుగా ఉన్నాయి.

ఇదే క్రమంలో... మచిలీపట్నం లోక్‌ సభ వైసీపీ అభ్యర్థి డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖరరావు ఆస్తులు రూ.138.41 కోట్లు కాగా... కాకినాడ నగర వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కుటుంబ ఆస్తులు రూ.76.01 కోట్లుగా వెల్లడించారు. అదేవిధంగా... విజయవాడ లోక్‌ సభ వైసీపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్‌ (నాని) కుటుంబ స్థిర, చరాస్తులు రూ.77.32 కోట్లు.

Tags:    

Similar News