హెలికాఫ్టర్ లో తిరిగే ఏకైక ఐఏఎస్.. ఆమెను పంపొద్దు!
కేసీఆర్ ప్రభుత్వంలో కీలక భూమిక పోషించినఆమె.. తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించారు.
కేసీఆర్ ప్రభుత్వంలో కీలక బాధ్యతల్ని నిర్వర్తించిన ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ పై మాజీ ఐఏఎస్ అధికారి కమ్ నిజాయితీకి నిలువెత్తు అద్దంగా పేర్కొనే ఆకునూరి మురళీ సంచలన ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్టు హాట్ టాపిక్ గా మారింది. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసుల్లోకి వెళుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన స్పందించారు. ఆమెను ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర సర్వీసుల్లోకి పంపొద్దన్న ఆయన.. గత ప్రభుత్వంలో చేసినవన్నీ చేసి.. కొత్త ప్రభుత్వం రాగానే కేంద్రానికి వెళ్లిపోవటం.. ఇక్కడి తప్పుల్ని తప్పించుకోవటం ఫ్యాషన్ గా మారిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తన ట్వీట్ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ కు ట్యాగ్ చేశారు. ‘ఏం తప్పులు చేయకపోతే ఎందుకు భుజాలు తడుముకోవటం. దేశంలో హెలికాఫ్టర్ లో వెళ్లి పనులను పర్యవేక్షించే ఏకైక ఐఏఎస్ అధికారిణి ఈమెగారే’’ అంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వంలో కీలక భూమిక పోషించినఆమె.. తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించారు. అంతేకాదు.. కాళేశ్వరం పనులతో పాటు మిషన్ భగీరథ పనులను పర్యవేక్షించటం.. ఇందులో భాగంగా ఆమె హెలికాఫ్టర్ లో పర్యటించేవారు.
వాస్తవానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక.. సీఎంవోకు వెళ్లటానికి పెద్దగా ఆసక్తి చూపని ఆమె.. తర్వాతి కాలంలో సీఎంలో కీలకభూమిక పోషించటం తరచూ ఐఏఎస్ ల మధ్య చర్చకు కారణమయ్యేది. ఇదిలా ఉంటే.. కొత్త ప్రభుత్వం కొలువు తీరి.. కీలక ఐఏఎస్ అధికారులంతా కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తున్న వేళ.. సీఎంవోలో కీలక బాధ్యతలు నిర్వర్తించే స్మితా సబర్వాల్ మాత్రం కలవలేదు. దీంతో.. ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లనున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే.. ఈ వార్తల్ని ఆమె ఖండిస్తూ ట్వీట్ చేశారు. తాను తెలుగు రాష్ట్రాల్లో 23 ఏళ్ల సర్వీసు పూర్తి చేశానని.. కొత్త సవాళ్లకు తాను ఎప్పుడు సిద్ధమని ట్వీట్ చేశారు. దీనికి ముందు ఆకునూరి మురళి చేసిన ట్వీట్ ఇప్పుడు దుమారంగా మారింది.మరి.. దీనిపై ఆమె రియాక్టు అవుతారో.. లేదంటే మౌనంగా ఉంటారో చూడాలి.