'పంద్రాగ‌స్టు' హాకీ వేడుక విషాదం.. పిడుగులు ప‌డి క్రీడాకారులు మృతి

జార్ఖండ్‌లోని సిండేగా జిల్లాలో పంద్రాగ‌స్టును పుర‌స్క‌రించుకుని కొంద‌రు క్రీడాకారులు హాకీ మ్యాచ్ నిర్వహించారు.

Update: 2024-08-15 10:11 GMT

దేశం మొత్తం స‌గ‌ర్వంగా నిర్వ‌హించుకునే పంద్రాగ‌స్టు వేడుక‌లు.. అన్ని రాష్ట్రాల్లోనూ ఘ‌నంగా సాగుతోం ది. ఈ క్ర‌మంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా దేశం ప‌ట్ల ప్ర‌జ‌లు త‌మ అభిమానాన్ని చాటుకుంటు న్నారు. ఇలా.. జార్ఖండ్‌లో పంద్రాగ‌స్టు వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకుని `హాకీ` వేడుక నిర్వ‌హించారు. అయితే.. ఈ వేడుక కొన్ని నిమిషాల్లోనే విషాదంగా మారిపోయింది. ప‌లువురు క్రీడాకారుల ఇళ్ల‌లో శోకాన్ని నింపింది.

ఏం జ‌రిగింది.

జార్ఖండ్‌లోని సిండేగా జిల్లాలో పంద్రాగ‌స్టును పుర‌స్క‌రించుకుని కొంద‌రు క్రీడాకారులు హాకీ మ్యాచ్ నిర్వహించారు. గ‌త మూడు రోజులుగా నిర్వ‌హిస్తున్న ఈ క్రీడ‌ల‌కు సంబంధించిన ఫైన‌ల్ మ్యాచ్ గురువారం ఉద‌యం ప్రారంభ‌మైంది. దీనిలో గెలిచిన వారికి ప్రైజ్ మ‌నీ స‌హా మొమొంటో అందిస్తారు. అయితే.. ఈ మ్యాచ్ ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే అనూహ్యంగా భారీ వర్షం కురిసింది. దీంతో స‌హ‌జంగానే చుట్టుప‌క్క‌ల ఉన్న నీడ‌లోకి క్రీడాకారులు చేరుకున్నారు.

ఇలా కొంద‌రు ఆటగాళ్లు, హాకీ చూసేందుకు వ‌చ్చిన వారు కూడా ప‌క్క‌నే గుబురుగా ఉన్న‌ చెట్ల కింద తలదాచుకున్నారు. అయితే అదే వారికి పెను శాపంగా ప‌రిణ‌మించింది. వారి జీవితాల‌ను అఘాథంలోకి నెట్టేసింది. క‌న్నుమూసి తెరిచేలోపే.. చెట్లపై భారీ శ‌బ్దంతో పిడుగులు పడి భీభ‌త్సం సృష్టించాయి. ఒక్క‌సారిగా రాజుకున్న మంట‌ల్లో చిక్కుకుని ముగ్గురు క్రీడాకారులు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఐదుగురు తీవ్ర గాయాల‌తో ప్రాణాలు ద‌క్కించుకున్నారు. వెంట‌నే హాకీ నిర్వాహ‌కులు వీరిని ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించారు.

మంట‌ల్లో చిక్కుకుని కాలిపోయిన‌ ముగ్గురు ఆటగాళ్ల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. వీరిని టుటికైల్ రేబెడా నివాసి సేనన్ డాంగ్, ఎనోస్ బండ్, తక్రమా నివాసి నిర్మల్ హోరోగా గుర్తించారు. అయితే.. ఈ ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన వారి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు.

Tags:    

Similar News