తెలంగాణలోని కులాలు 243..ఏ కులం బలం ఎంతంటే.?
వీటన్నిటి రీత్యా తెలంగాణ కుల గణన ప్రాధాన్యం సంతరించుకుంది.
By: Tupaki Desk | 11 Nov 2024 10:30 PM GMTభారతీయ సమాజంలో కులమే మూలం. మతం 2 వేల ఏళ్ల కిందట వస్తే కులానికి 3 వేల ఏళ్ల చరిత్ర ఉందని అంటారు. ఎవరో అభ్యుదయ వాదులు తప్ప.. కులానికి ఎవరూ అతీతులు కాదు. కాగా, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టింది. ఇది దేశవ్యాప్తంగానూ చర్చనీయాంశం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో మూడు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. అవి తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. అంతేగాక కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కుల గణన చేపడతామని ప్రకటిస్తున్నారు. వీటన్నిటి రీత్యా తెలంగాణ కుల గణన ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఈ గణనలో ఎన్ని కులాలు ఉన్నాయి..? అనేది బయటపడింది.
బీసీలదే సగం..
మొత్తం 243 కులాలు ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఓసీలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీల వారీగా ఎన్ని కులాలున్నాయో కూడా వెల్లడించింది. సర్వేలో వివరాలను సేకరించేందుకు ఆయా కులాలకు కోడ్‌లు కేటాయించింది. రాష్ట్రంలో ఉంటున్న ఇతర రాష్ట్రాల వారికి కూడా ప్రత్యేక కోడ్ లు కేటాయించింది. అయితే, తమకు ఏ కులం, మతం లేదని చెప్పేవారినీ ప్రత్యేక కోడ్ కింద పరిగణిస్తోంది.
వివక్ష ఉందా?
మీకు ప్రార్థనా మందిరాలకు వెళ్లే విషయంలో కుల వివక్ష ఎదురవుతోందా? అని తెలంగాణ సర్కారు తెలుసుకుంటోంది. రాష్ట్రంలో శనివారం ప్రారంభమైన కులగణన ప్రశ్నావళిలో ఎన్యుమరేటర్లు ఈ వివరాలన్నింటినీ సేకరిస్తున్నారు.
ఎస్సీల్లో ఆది ఆంధ్ర నుంచి వల్లూవాన్ వరకు మొత్తం 59 కులాలు ఉన్నట్లు, ఎస్టీల్లో అంధ్ నుంచి నక్కల కుర్వికరణ్ వరకు కలిపి 32 కులాలు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
బీసీలలో 134 కులాలు ఉన్నట్లు తెలిపింది. బీసీ-ఏ కేటగిరీలో 57, బీసీ-బీలో 27, బీసీ-సీలో 1, బీసీ-డీలో 35, బీసీ-ఈలో 14 కులాలు ఉన్నాయి.
-అనాథలు, పదేళ్ల వయసు రాకముందే తల్లిదండ్రులను కోల్పోయి నిరాశ్రయులైన పిల్లలను బీసీ-ఏ కేటగిరీ కింద నమోదు చేస్తున్నారు.
క్రైస్తవ మతంలోకి మారిన షెడ్యూల్ కులాల (ఎస్సీలు) వారితో పాటు వారి సంతానాన్ని బీసీ-సీలో నమోదు చేస్తున్నారు.
ఓసీల్లో 18 కులాలు..
ఓపెన్ కేటగిరీ (ఓసీ)లో మొత్తం 18 కులాలున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. బీసీ-సీలో లేని క్రైస్తవులు, బీసీ-ఈలో లేని ముస్లింలను కూడా ఓసీలో ఉంచారు.
జైనులు, బౌద్ధులు, లింగాయత్, మార్వాడీ, పట్నాయక్, సిక్కులు, వర్మలు కూడా ఓసీలనే పేర్కొంది తెలంగాణ సర్కారు. ఇంకా ఎవరైనా ఇతరులుంటే వారి కోసం ‘000’ను కోడ్ నమోదు చేస్తోంది.