పవన్‌ ఎఫెక్ట్‌.. అక్కడ కూడా రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌!

2019లో టీడీపీ అధికారం కోల్పోవడంతో అక్కడ రియల్‌ ఎస్టేట్‌ బాగా మందగించింది.

Update: 2024-07-05 14:12 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో మళ్లీ అమరావతికి మంచి రోజులొచ్చాయి, వైసీపీ ఐదేళ్ల పాలనలో అమరావతి పూర్తిగా పడకేసిందనే విమర్శలున్నాయి. 2014–19 వరకు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అమరావతిలో రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ బాగా కొనసాగింది. 2019లో టీడీపీ అధికారం కోల్పోవడంతో అక్కడ రియల్‌ ఎస్టేట్‌ బాగా మందగించింది. రియల్టీ సంస్థలన్నీ హైదరాబాద్‌ కు తిరిగి వెళ్లిపోయాయి.

ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి మళ్లీ మళ్లీ కళకళలాడనుంది. అయితే ఒక్క అమరావతే కాదు. కొత్తగా పిఠాపురంలో కూడా రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ కొనసాగుతోంది.

జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ పిఠాపురం నుంచి పోటీ చేసి ఘనవిజయం సాధించడంతో ఆ నియోజకవర్గం రూపురేఖలు మారిపోతున్నాయి. ఇప్పటికే పిఠాపురం ప్రముఖ ఆధ్యాత్మిక పట్టణంగా ఉంది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన పురుహుతికా దేవి గుడి ఉంది. అలాగే పాదగయగా పేరుగాంచిన శ్రీపాద క్షేత్రం, కుక్కుటేశ్వర దేవాలయం, ఆంధ్రా బాప్టిస్ట్‌ చర్చి తదితరాలతో నిత్యం పిఠాపురంకు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు.

అయితే ఇప్పుడు జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ గెలుపుతో పిఠాపురం జాతీయ స్థాయిలో మార్మోగుతోంది. దీనికి తగ్గట్టే పవన్‌ కూడా పిఠాపురంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని.. దేశంలోనే మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. దీనికి తగ్గట్టే కార్యాచరణలోకి పవన్‌ దిగేశారు. తన హామీలను వరుసగా నిలుపుకునే పనిలో ఉన్నారు.

అంతేకాకుండా పిఠాపురంలో నివాసానికి, క్యాంపు కార్యాలయానికి 3 ఎకరాల స్థలాన్ని కూడా పవన్‌ తీసుకున్నారు. పిఠాపురం మండలం భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 3.52 ఎకరాల స్థలాన్ని ఆయన కొనుగోలు చేశారు. పవన్‌ పేరిట ఈ భూముల రిజిస్ట్రేషన్‌ కూడా పూర్తయిందని సమాచారం.

పవన్‌ నిర్ణయం జనసేన పార్టీ నేతలు, శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. పవన్‌ కళ్యాణ్‌ కొనుగోలు చేసిన భూమి చుట్టూ ఉన్న 16 ఎకరాల భూమిని కొనుగోలు చేయడానికి ఆ పార్టీ నేతలు ముందుకొచ్చారు.

అంతేకాకుండా రానున్న కాలంలో పిఠాపురం భారీ ఎత్తున అభివృద్ధి చెందుతుందని గ్రహించిన తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన రియల్టర్లు పిఠాపురానికి వస్తున్నారు.

పిఠాపురంలో భూమి కొనుగోలు చేసి స్థిరపడాలని నిర్ణయించుకున్నట్లు పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించకముందు ఆ ప్రాంతంలో భూమి విలువ ఎకరా రూ.20–25 లక్షలుగా ఉంది. ఇక తాను పిఠాపురంలోనే ఉంటానని పవన్‌ ప్రకటించగానే.. గత రెండు రోజుల్లో ఎకరాకు రూ.75 లక్షల నుంచి రూ.కోటి వరకు ధరలు పెరిగిపోయాయి.

రోడ్డు పక్కన ఉన్న భూమి అయితే ఎకరా రూ. 3 కోట్ల వరకు పెరిగింది. అయినప్పటికీ సంపన్న వ్యక్తులు ఫామ్‌ హౌస్‌ లను నిర్మించడానికి, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ లను అభివృద్ధి చేయడానికి పెద్ద ఎత్తున భూమిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

పిఠాపురం నియోజకవర్గంలో సముద్ర తీరం వెంట సాగుకు ఇబ్బందిగా మారిన మెట్ట ప్రాంతాలు పవన్‌ కళ్యాణ్‌ పుణ్యమాని మంచి ధరను దక్కించుకుంటున్నాయని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News