వీసా ప్రాసెసింగ్ ఫీజు పెంచిన యూఎస్... కారణం ఇదేనంట!
అవును... వచ్చే సంవత్సరం హెచ్-1 బీ వీసా ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు పెరగనుందని యూఎస్ సీఐఎస్ వెల్లడించింది.
ఉన్నత చదువుల కోసం అగ్రరాజ్యం అమెరికాకు ఎక్కువగా వెళ్లే విద్యార్థులలో భారతీయుల సంఖ్య ఎక్కువని చెబుతుంటారు. ఈ సమయంలో హెచ్-1బి వీసా దరఖాస్తుల ఫీజులకు సంబంధించి అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... వీసా దరఖాస్తుల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజును పెంచుతున్నట్లు అమెరికా పౌరసత్వం, వలస సేవల సంస్థ (యూఎస్ సీఐఎస్) ప్రకటించింది.
అవును... వచ్చే సంవత్సరం హెచ్-1 బీ వీసా ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు పెరగనుందని యూఎస్ సీఐఎస్ వెల్లడించింది. ఇందులో భాగంగా... ఈ పెంపు 12% ఉంటుందని తెలిపింది. అంటే... కొత్త ఫీజు 2,805 డాలర్లు గా ఉంటుంది! పెరిగిన ఈ ఫీజు వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి అమలులోకి రానుందని తెలుస్తుంది.
ఈ మేరకు యూఎస్ సీఐఎస్ వెల్లడించిన వివరాల ప్రకారం... ఐ-129, ఐ-140, ఐ-539, ఐ-765 వీసా ఫాంస్ కు సంబంధించిన ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు పెరుగుతుంది. ఇందులో నాన్ ఇమిగ్రంట్ వర్కర్ కు సంబంధించిన ఐ-129 వీసా దరఖాస్తు ఫీజు ప్రస్తుతం 2,500 డాలర్లుగా ఉండగా.. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి 2,805 డాలర్లకు పెరుగుతుంది.
ఇక ఫాం ఐ-140 కి సంబంధించిన ఫీజు ప్రస్తుతం 2,500 డాలర్లు ఉండగా.. ఇది కూడా 2,805 డాలర్లకు పెరగనుంది. ఇదే సమయంలో... ఫ్రాం ఐ-539 విషయానికొస్తే ప్రస్తుతం 1,750 డాలర్లుగా ఉన్న ఈ ఫీజు... 1,965 డాలర్లకు పెరగనుంది. అదేవిధంగా ఫాం ఐ-765 కు సంబంధించి ప్రస్తుతం 1,500 డాలర్లుగా ఉన్న ఫీజు వచ్చే ఏడాది నుంచి 1,685 కి పెరగనుంది.
ఈ విషయాలపై స్పందించిన యూఎస్ సీఐఎస్... వీసా ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజును పెంచడం ద్వారా దరఖాస్తు దారులకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలను అందించడానికి వీలవుతుందని తెలిపింది. ఇదే సమయంలో ప్రీమియం వీసా దరఖాస్తుల ఫీజును ప్రతీ ఆరు నెలలకు ఒకసారి పెంచుతామని వెల్లడించింది.