గోడ దూకే గ్యాంగ్ రెడీనా ?

అందుకే ఎన్ని ఫిరాయింపు చట్టాలు వచ్చినా గోడ దూకుళ్ళకు అడ్డుకట్ట పడడంలేదు.

Update: 2024-06-01 00:30 GMT

రాజకీయం అంటేనే రసవత్తరం. దానికి వేరే బారికేడ్స్ కానీ వేరే ప్రమాణాలు కూడా ఉండవు. ఎవరిదైనా స్వేచ్చా వాదం. ఎవరి మనసు ఎలా చెబితే అంతే. అందుకే ఎన్ని ఫిరాయింపు చట్టాలు వచ్చినా గోడ దూకుళ్ళకు అడ్డుకట్ట పడడంలేదు.

ఇదిలా ఉంటే ఏపీలో హోరా హోరీ పోరు సాగుతోంది అని పోలింగ్ అనంతరం వచ్చిన పలు అంచనాలు చెబుతున్నాయి. ఎవరికి అధికారం దక్కినా పది లోపే ఎక్కువ అని అంటున్నారు. ఆ పది అటు నుంచి ఇటు దూకితే చాలు కదా అధికారం అనే వరమాల అటు నుంచి ఇటు వైపు పడిపోతుంది.

అందుకే ఇపుడు ఎదుటి పార్టీలలో విభీషణులను కనుగొనే ప్రయత్నం అయితే గట్టిగా సాగుతోందిట. ఎన్నికల్లో ఎవరికి వారు తమ విజయావకాశాలను బేరీజు వేసుకుంటున్నారు. రాజకీయ పార్టీల అధినేతలకు తమ పొజిషన్ ఏంటో తెలుసు.

పైగా ఈసారి డూ ఆర్ డై గా పొలిటికల్ వార్ సాగింది. దాంతో కచ్చితంగా అధికారంలోకి రావాలన్న పట్టుదల అయితే పెరిగిపోతోంది. మరో చాన్స్ తీసుకునేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. దాంతో ఈసారి బొటా బొటీ మెజారిటీ వస్తే కనుక అటు నుంచి ఇటు గోడ దూకుళ్ళకు తెర లేచే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జోరుగా సాగుతోంది.

గతలో ఒక పార్టీలో ఉండి ఇపుడు వేరే పార్టీలలో చేరిన వారు గెలుపు గుర్రాలతో పార్టీలు టచ్ లోకి వచ్చాయని కధనాలు అయితే విన వస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు రాజ మార్గాలు అన్నీ అయిపోయిన మీదట ఇది చివరి మాత్రం. అడ్డ దారి అని ఎవరైనా అనుకోనీ కానీ జరగాల్సింది జరగాలి.

గెలుపు పిలుపు వినాల్సిందే. అంతే కాదు. జెండా ఎగరేయాల్సిందే. ఈ రకమైన ఆలోచనలతోనే తరె వెనక కసరత్తు ముమ్మరంగా సాగుతోంది అని అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ప్రతీ చిన్న విషయాన్ని సీరియస్ గానే తీసుకున్నాయి. గెలుపు కోసం చేయాల్సింది అంతా చేశాయి.

ఇపుడు కర్నాటకమో లేక తెలంగాణామో తెలియదు కానీ అక్కడ ముందస్తుగా వినిపించిన ఈ తరహా గోడ దూకుళ్ళ ముచ్చట్లు వినిపిస్తున్నాయి. కర్నాటకలో ఆయితే బ్రహ్మాండమైన మెజారిటీని కాంగ్రెస్ కి ఇచ్చారు. దాంతో ఆ పరిస్థితి రాలేదు. తెలంగాణాలో కూడా కాంగ్రెస్ కి బాగానే మెజారిటీ వచ్చింది.

ఏపీలో చూస్తే మ్యాజిక్ ఫిగర్ కి అటూ ఇటూ సీట్లు వచ్చినా కూడా ప్రమాణం కంటే ముందే కొంప ముంచేసే విభీషణులు ఉన్నారని అంటున్నారు. ఈ రకమైన గోడ దూకుళ్ళ బ్యాచ్ రెడీ అయింది అని సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.

మరి వారిని తెర వెనక నడిపించే శక్తులు ఏవీ ఏ పార్టీ ఈ విషయంలో ముందంజలో ఉంది. ఏ పార్టీ ఈ తరహా ప్లాన్ బీని అనుసరించే చాన్స్ ఉంది అంటే అంతా సస్పెన్స్. అయితే ఏపీ ప్రజలు ఓటేసిన తీరు చూసినా భారీగా పెరిగిన పోర్లింగ్ శాతం చూసినా ఏదో ఒక పార్టీకి బ్రహ్మాండమైన మెజారిటీతోనే అధికారం కట్టబెట్టే దిశగానే ఏపీ నడచింది అని అంటున్నారు. చూడాలి మరి జూన్ 4 న ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News