రోజుకు 5 లక్షల బూడిద.. కూటమిలో కుమ్ములాట..!
దీంతో రాజకీయాలు వేడెక్కాయి. కాదు కాదు.. సలసలా మండుతున్నాయి.
బూడిద కోసం ఎవరైనా తన్నుకుంటారా? ఎక్కడైనా ఆధిపత్య ధోరణి ఉంటుందా? అంటే.. ఉండదనే చెబుతారు సహజంగా! కానీ, రోజుకు 5 లక్షల రూపాయలు కురిపించే బూడిద కావడంతో అధికార పార్టీ నాయకులు కుమ్ములాడుకుంటున్నారు. ఒకరిపై ఒకరు ఆధిపత్య ధోరణి ప్రదర్శించుకుంటున్నారు. దీంతో రాజకీయాలు వేడెక్కాయి. కాదు కాదు.. సలసలా మండుతున్నాయి. ఈ వ్యవహారం మొత్తం రెండు కీలక జిల్లాల్లో సాగుతుండడం గమనార్హం.
ఎవరు? ఎక్కడ?
కడప జిల్లాలోని ఎర్రగుండ్ల పాలెంలో ఉన్న రాయల సీమ ధర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి రోజూ వందల టన్నుల బూడిద(ఫ్లై యాష్) ఉత్పత్తి అవుతుంది. టన్నుకు రూ.200 చొప్పున కట్టి.. ఈ బూడిదను ఎవరైనా తీసుకోవ చ్చు. ఒక్కొక్కసారి ఆ సొమ్ములు కూడా కట్టాల్సిన అవసరం లేదు. అయితే.. ఈ బూడిద ఆ విద్యుత్ కేంద్రానికి భారమైతే.. పొరుగున అనంతపురంలో ఉన్న సిమెంటు కంపెనీలకు బంగారం. ఎందుకంటే.. సిమెంటు తయారీలో ఫ్లై యాష్ ను వినియోగిస్తారు.
సుమారు.. 160 కిలో మీటర్ల దూరంలో ఈ ఫ్లై యాష్ రవాణా చేస్తారు. అంటే.. ధర్మల్ పవర్ కేంద్రం నుంచి అనంతపురంలోని తాడిపత్రి నియోజకవర్గం పరిధిలో ఉన్న సిమెంటు కంపెనీలు ఈ బూడిదను కొనుగో లు చేస్తాయి. తద్వారా.. దీనిని రవాణా చేసే వారికి కాసు ల పంట పండుతోంది. రోజుకు రూ.5 లక్షల వర కు.. చెల్లిస్తారు. ఇదే ఇప్పుడు కూటమి పార్టీల నాయకుల మధ్య ఆధిపత్యానికి, రగడకు కూడా దారి తీసిం ది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిల మధ్య పరిస్థితి భగ్గు మంటోంది.
ధర్మల్ పవర్ నుంచి వచ్చే బూడిదను తామే రవాణా చేసుకుంటామని జేసీ వర్గం చెబుతుండగా.. కాదు తామే రవాణా చేస్తామని ఆది వర్గం భీష్మిస్తోంది. ఈ క్రమంలోనే ఒకరి వాహనాలపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు. ఫలితంగా ఇరు జిల్లాల్లోనూ పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. ఇది అంతిమంగా ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇలాంటి ఘటనలు వద్దని చెబుతున్నా.. చంద్రబాబు నెత్తీనోరూ మొత్తు కుంటున్నా వినిపించుకునే నాధుడు లేకపోవడం గమనార్హం.