పులివెందులలో రాజకీయ పులి జూదం

జగన్ మీద ఓటమి పాలు అయిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తూ పోతోంది అని వైసీపీ నేతలు అంటున్నారు.

Update: 2024-07-06 16:41 GMT

పులివెందుల అంటే జగన్ కి కంచుకోట లాంటి నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో ఇపుడు టీడీపీ రాజకీయ సయ్యాట మొదలెట్టింది. జగన్ మాజీ సీఎం. జస్ట్ ఎమ్మెల్యే ఆయనతో రాజకీయ చెలగాటకు ఇదే సమయం అని భావిస్తోంది. జగన్ మీద ఓటమి పాలు అయిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తూ పోతోంది అని వైసీపీ నేతలు అంటున్నారు.

వేంపల్లెలో వైసీపీ కార్యకర్త అజయ్ కుమార్ రెడ్డి పైన విచక్షణా రహితంగా దాడులు చేయడం మీద వైసీపీ మండిపడుతోంది. ఒంటరిగా ఉన్న సమయం చూసి దాడి చేయడం ఏంటి అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల రోజు బీటెక్ రవి చిన్నాన్న మరి కొందరు దౌర్జన్యానికి తెగ బడ్డారని అంటున్నారు. అపుడు అజయ్ కుమార్ రెడ్డి అడ్డుకున్నారు అన్న దానికి ఇపుడు సమయం చూసుకుని బదులు తీర్చుకున్నారు అని అంటున్నారు.

దీంతో తాజాగా అజయ్ కుమార్ రెడ్డి మీద దాడి జరిగింది. దాంతో కడప రిమ్స్ లో అజయ్ ని పరామర్శించిన వైఎస్ జగన్ ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వం మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతల మీద దాడులకు పాల్పడితే దానికి తగిన భారీ మూల్యం చెల్లించుకుంటారు అని హెచ్చరించారు.

చంద్రబాబు పాపాలు శరవేగంగా పండుతున్నాయని కూడా జగన్ విమర్శించారు. ఇది చెడు సంప్రదాయం అని అన్నారు. దీనిని ఇక్కడితో ఆపాలని కోరారు. ఎల్లకాలం టీడీపీయే అధికారంలో ఉండదని గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. 20 ఏళ్ల చిన్న పిల్లాడిని నిర్దాక్షిణ్యంగా కొట్టారని జగన్ ఆరోపించారు.

ఇంతవరకూ పులివెందులలో ఇలాంటి సంప్రదాయం లేదని జగన్ అన్నారు. వైసీపీ క్యాడర్ మీద దాడులు అంటే భయాందోళనలు కలిగించేందుకే చేస్తున్నారు అని ఆయన అన్నారు. శిశుపాలుడి పాపాల మాదిరిగా బాబు పాపాలు తొందరగానే పండుతాయని జగన్ అంటున్నారు.

కూటమి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జగన్ కోరారు. హామీల అమలు మీద దృష్టి సారించకుండా వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేయడమేంటి అని జగన్ నిలదీశారు. ఇదే విధంగా ముందుకు పోతే రేపటి రోజున ఇదే పాపం టీడీపీకి చుట్టుకుంటుందని ఆయన హెచ్చరించారు. మొత్తానికి పులివెందులలో వైసీపీని వీక్ చేసేందుకు ఈ దాడులు చేస్తున్నారు అని రాజకీయంగా చర్చ సాగుతోంది.

లోకల్ ఎమ్మెల్యేగా జగన్ ఉన్నా స్థానిక లీడర్లకే పార్టీ బాధ్యతలు అప్పగించారు. దాంతో జగన్ ని సొంత నియోజకవర్గంలో కట్టడి చేసేందుకే ఈ దాడులు అని అంటున్నారు. ఏకంగా పులివెందులలోలోనే రాజకీయ పులిజూదం మొదలైంది. ఈ ఆటలో పరిణామాలు పర్యవసానాలు ఏ తీరుగా ఉంటాయో చూడాల్సిందే.

Tags:    

Similar News