ఒకే ఒక్క మాట కారణం... పెళ్లైన 3 నిమిషాలకే విడాకులు!

ఈ క్రమంలోనే తాజాగా ఓ జంట పెళ్లైన 3 నిమిషాలకే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కింది.

Update: 2024-07-27 01:30 GMT

కొన్ని సందర్భాల్లో వివాహ బంధం ఎంత బలమైనదనే విషయం తెలుస్తుంటే.. మరికొన్ని సందర్భాల్లో ఎంత బలహీనమైనదో తెలుస్తుంటుందనే విషయం ఇటీవల కాలంలో జరుగుతున్న కొన్ని పరిణామాలను చూస్తే అర్థం అవుతుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ జంట పెళ్లైన 3 నిమిషాలకే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కింది.

అవును... గల్ఫ్ దేశం కువైట్ లో తాజాగా ఆ ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. ఇందులో భాగంగా పెళ్లైన 3 నిమిషాలకే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన పరిస్థితి నెలకొంది. దీనికి గల కారణం కొంతమందికి సిల్లీగా అనిపిస్తుండగా.. మరికొంతమందికి మాత్రం ఆత్మాభిమానానికి సంబంధించిన విషయంగా అనిపిస్తుంది.

వివరాళ్లోకి వెళ్తే... కువైట్ లో పెళ్లి పూర్తయిన అనంతరం భార్యాభర్తలు పెళ్లి వేడుక నుంచి వెళ్తున్నారు. ఆ సమయంలో పెళ్లి కూతురు బ్యాలెన్స్ తప్పి పడిపోయింది. అయితే... పక్కనే ఉన్న వరుడు ఆమెను "తెలివి తక్కువ దద్దమ్మ" అని అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఈ మాటే విడాకులకు కారణమైంది.

ఈ మాట విన్న పెళ్లికూతురు ఆ క్షణమే బలమైన నిర్ణయం తీసేసుకుంది. ఇందులో భాగంగా... అతడితో విడాకులు కావాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు కోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. దీంతో... కువైట్ చరిత్రలోనే అతిస్వల్పకాల వివాహంగా ఇది రికార్డ్ సృష్టించిందని చెబుతుంటారు.

వాస్తవానికి ఈ ఘటన 2019లో జరగ్గా.. తాజాగా వైరల్ గా మారింది. తాను ఓ వివాహానికి వెళ్లాలని, అక్కడ వరుడు.. పెళ్లి కూతురిని ఎగతాళిచేస్తూ మాట్లాడటంతో ఆమె హర్ట్ అయ్యి విడాకులు ఇచ్చిందని ఓ వ్యక్తి ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టడంతో నాటి ఘటన నేడు నెట్టింట వైరల్ గా మారింది.

దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా... "ఇంత చిన్న విషయానికే అంత పెద్ద నిర్ణయమా" అని ఒకరు కామెంట్ చేస్తుంటే... "గౌరవం లేకపోవడంతో విఫలమైన పెళ్లి.. గుడ్ డెసిషన్" అని మరొకరు స్పందిస్తున్నారు. ఇదే క్రమంలో "పెళ్లివేడుకలోనే ఇలా ప్రవర్తించిన వ్యక్తిని జీవితాంతం భరించడం కంటే వదిలేయడమే మంచిది" మరొకరి రియాక్షన్!

కాగా... 2004లో యునైటెడ్ కింగ్ డమ్ లో ఓ జంట వివాహం అయిన 90 నిమిషాల తర్వాత విడాకుల కోసం దాఖలు చేసింది. గ్రేటర్ మాంచెస్టర్ లోని స్టాక్ పోర్ట్ రిజిస్టర్ ఆఫీసులో స్కాట్ మెక్కీ - విక్టోరియా ఆండర్సన్ పెళ్లి చేసుకున్న గంటన్నర తర్వాత వీరి బంధం ముగిసింది. రిసెప్షన్ లో తోడ పెళ్లి కూతుళ్లపై తన భర్త ఫైర్ అయినందుకు ఆమె ఆగ్రహం వ్యక్తం చేసి విడాకులు కోరింది!!

Tags:    

Similar News