ఏపీలో శాంతి భద్రతలను సమీక్షించాల్సిన బాధ్యత అంతా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీల మీదనే ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాజాగా మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల కాలంలో వరసగా బడుగు బలహీన వర్గాల మీద వరసబెట్టి దాడులు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోని పరిస్థితి ఉందని అన్నారు. ఏపీలో శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారు అని ఆయన విమర్శించారు.
అయితే ఏపీలో ఎన్నికల కోడ్ ని అడ్డం పెట్టుకుని టీడీపీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది అని సజ్జల ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యాక 28 పోలీస్ అధికారులను బదిలీ చేశారని ఆయన అన్నారు. ఇపుడు టీడీపీ ఆ అండతోనే వైసీపీ శ్రేణుల మీద దాడులకు తెగబడుతోంది అని సజ్జల విమర్శించారు.
తిరిగి వైసీపీ దాడులు చేయిస్తోంది అని ఎదురు విమర్శలు చేస్తున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు.ఈసీ పూర్తిగా పక్షపాత ధోరణితోనే వ్యవహరిస్తోందని సజ్జల ఆరోపించారు.
ఇదిలా ఉండగా ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుంచి జగన్ అసలు ఏమీ పట్టించుకోవడం లేదు అని ఆయన అన్నారు. రాష్ట్ర దైనందిన పాలనలో జగన్ ఏ మాత్రం జోక్యం చేసుకోవడం లేదు అని ఆయన స్పష్టం చేశారు. ఏదైనా అర్జంట్ ఫైల్ అని తన దగ్గరకు వస్తే మాత్రం దాని మీదనే ఆయన సంతకం పెడుతున్నారు తప్ప అంతకు మించి ఆయన ఏమీ చేయడం లేదు అని సజ్జల అన్నారు. అందువల్ల ఏపీలో లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ లో పెట్టాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం మీదనే ఉందని ఆయన అన్నారు. ఈ విషయంలో తాము చెప్పాలనుకుంటున్నంది ఈసీకే చెబుతున్నామని ఆయన చెప్పారు.