ధనవంతుల పళ్లూడగొట్టేలా 'పన్ను'.. తెరపైకి తెచ్చిందెవరంటే..?

సరిగ్గా ఈ ఏడాది లోక్ సభ ఎన్నికల సమయంలో తెరపైకి వచ్చింది ‘సూపర్ రిచ్ ట్యాక్స్’. దీంతో పెద్దఎత్తున కలకలం రేపింది.

Update: 2024-12-14 17:30 GMT

సరిగ్గా ఈ ఏడాది లోక్ సభ ఎన్నికల సమయంలో తెరపైకి వచ్చింది ‘సూపర్ రిచ్ ట్యాక్స్’. దీంతో పెద్దఎత్తున కలకలం రేపింది. అధిక సంపన్నుల ఆదాయం మీద పన్ను విధించడమే సూపర్ రిచ్ ట్యాక్స్. అయితే, కాంగ్రెస్ నాయకుడు శ్యామ్ పిట్రోడా ఎన్నికల సమయంలో చేసిన ఈ ప్రతిపాదన పెను దుమారం రేపింది. చివరకు బీజేపీ దీనిని తమ ప్రచారంలోనూ వాడుకుంది. కాగా, మళ్లీ ఇప్పుడు భారత్‌లో అత్యధిక ఆదాయ అసమానతలు ఉన్నాయని.. అందకని సంపన్నులపై అధికంగా పన్నులు విధించాలని ఓ ఆర్థికవేత్త సూచించారు.

ఢిల్లీకి చెందిన రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ (ఆర్ఐఎస్), ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్ నిర్వహించిన ఫ్రెంచ్ ఆర్థికవేత్త థామస్‌ పికెట్టీ పాల్గొన్నారు. ఈయన ‘క్యాపిటల్‌ ఇన్‌ 21వ సెంచరీ’ పుస్తక రచయిత కూడా. ఈ సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థపై పికెట్టి మాట్లాడారు.

సూపర్ రిచ్ వీరే..

రూ.10 కోట్లు ($1.18 మిలియన్) కంటే ఎక్కువ ఆస్తులు కలిగిన వ్యక్తులపై రెండు శాతం సంపద పన్ను విధించాలని పికెట్టీ సూచించారు. దీంతో భారత్ స్థూల దేశీయోత్పత్తిలో 2.73 శాతం విలువైన వార్షిక ఆదాయం పెరుగుతుందని అన్నారు. విలువైన ఆస్తిపై 33 శాతం వారసత్వ పన్ను విధించవచ్చని కూడా పికెట్టి పేర్కొన్నారు. కాగా, ప్రజల మధ్య అత్యధిక స్థాయిలో ఆదాయ అసమానతలను నివారించాలంటే సూపర్‌ రిచ్‌ వ్యక్తులపై అధికంగా పన్నులు విధించాలని పికెట్టీ సూచించారు. రూ.10 కోట్లకు మించి ఆదాయం కలిగిన సంపన్నులపై పన్ను విధిస్తే భారత్‌ వార్షిక ఆదాయం 2.73 శాతం పెరుగుతుందని అంచనా వేశారు. పన్ను విధించడంలో సహకరించడానికి 20 ప్రధాన ఆర్థిక వ్యవస్థల సమూహానికి చెందిన ఆర్థిక మంత్రులు జూలైలో చేసిన ప్రతిజ్ఞను అనుసరించాలని భారత్‌ కు పిలుపునిచ్చారు.

ఒక శాతం అగ్రశ్రేణి సంపన్న భారతీయుల జాతీయాదాయ నిష్పత్తి అమెరికా, బ్రెజిల్‌లోని వారి ప్రత్యర్ధులను మించిన సంగతిని పికెట్టీ ప్రస్తావించారు. 2022-23 జనాభాలో అత్యంత ధనవంతులైన ఒక శాతం మంది దేశానికి చెందిన మొత్తం సంపదలో 40.1 శాతాన్ని కలిగి ఉన్న సంగతి గుర్తుచేశారు.

ఫోర్బ్స్‌ జాబితా భారత్‌ లో 100 మంది అత్యంత ధనవంతుల మొత్తం సంపద ట్రిలియన్‌ డాలర్లు దాటినట్లుగా వెల్లడించింది. దేశంలో అపర కుబేరుల సంపద 1.1 ట్రిలియన్‌ డాలర్లు ఉందని పేర్కొంది. రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ 119.5 బిలియన్‌ డాలర్లతో, అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ 116 బిలియన్‌ డాలర్ల సంపదతో ఒకటీ, రెండుస్థానాల్లో ఉన్నట్లు వివరించింది.

Tags:    

Similar News