నరం దొరక్క నిలిచిపోయిన మరణశిక్ష!

ఇప్పుడు ఇలాగే అమెరికాలో ఒక నేరస్తుడి రక్తనాళం దొరక్కపోవడంతో అతడికి మరణశిక్షను వాయిదా వేశారు

Update: 2024-02-29 16:30 GMT

నరం (రక్తనాళం) దొరక్కపోతే ఇంజెక్షన్‌ చేయడం కష్టమవుతుంది. సాధారణంగా కొంతమంది అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లినప్పుడు ఇంజెక్షన్‌ చేయాలంటే వైద్య సిబ్బంది రోగి చేతి నరం కోసం వెతుక్కుంటారు. రక్తనాళం దొరక్కపోతే ఇంజెక్షన్‌ చేయడం కష్టమవుతుంది.

ఇప్పుడు ఇలాగే అమెరికాలో ఒక నేరస్తుడి రక్తనాళం దొరక్కపోవడంతో అతడికి మరణశిక్షను వాయిదా వేశారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. అమెరికాకు చెందిన థామస్‌ యూజీన్‌ క్రీచ్‌ (73).. ఓ సీరియల్‌ కిల్లర్‌. ఈ క్రమంలో మూడు రాష్ట్రాల్లో ఐదు హత్యలు చేశాడు. అనేక కేసుల్లో అతడిపై అభియోగాలు ఉన్నాయి. ఇప్పటికే నిరూపితమైన కేసులో దాదాపు 50 ఏళ్లుగా అతడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

ఈ శిక్షలు చాలవన్నట్టు జైలులో ఉన్నప్పుడు 1981లో తోటి ఖైదీపై థామస్‌ యూజీన్‌ క్రీచ్‌ దాడి చేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులోనే థామస్‌ కు మరణశిక్ష పడింది. ప్రాణాంతక ఇంజెక్షన్‌ ఇచ్చి అతడిని కడతేర్చాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

మరణ శిక్షను అమలు చేయడానికి అమెరికాలోని ఇడాహోలోని మరణశిక్ష ఛాంబర్‌ లోకి థామస్‌ యూజీన్‌ క్రీచ్‌ ను తీసుకెళ్లారు. ప్రాణాంతక ఇంజెక్షన్‌ ను అతడికి ఇవ్వడానికి ముగ్గురు వైద్య సిబ్బంది అతడి చేతులు, కాళ్లు, భుజాలతోపాటు ఇతర ప్రాంతాల్లో రక్తనాళం కోసం వెతికారు. ఇలా గంటపాటు దాదాపు ఎనిమిది సార్లు ప్రయత్నించినా సరైన రక్తనాళం లభించలేదు. దీంతో చేసేదేమీ లేక అతడికి మరణశిక్షను నిలిపేశారు.

కాగా థామస్‌ ‘డెత్‌ వారెంట్‌’ గడువు ముగిసిపోతుండటంతో ప్రత్యామ్నాయ మార్గాల కోసం ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదే సమయంలో మానవీయ, రాజ్యాంగబద్ధమైన విధానంలో మరణశిక్షను అమలు చేయడంలో అధికారులు విఫలమయ్యారని పేర్కొంటూ దోషి తరఫు న్యాయవాది స్థానిక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. దీన్ని విచారించిన న్యాయస్థానం.. ఈ ‘డెత్‌ వారెంట్‌’ ముగిసేలోపు మరోసారి మరణశిక్ష అమలుకు ప్రయత్నించవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో థామస్‌ కు శిక్ష అమలు చేయాలంటే అధికారులు కొత్తగా మరో వారెంట్‌ ను పొందాల్సి ఉంటుంది.

Tags:    

Similar News