ఆ టికెట్‌లు జనసేనకే... తమ్ముళ్ల లెక్కలు..!
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ నియోజకవర్గంలో సంప్రదాయం అంటూ ఏమీ లేదు.
జనసేన-టీడీపీ పొత్తు నేపథ్యంలో ఆ పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారు? ఎక్కెడక్కడ పోటీ చేస్తుందనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని కొన్ని సీట్లపై ఇప్పటికే జనసేన నాయకులు, అటు టీడీపీ తమ్ముళ్లు కూడా ఒక నిర్ణయానికి వచ్చేశారని సమాచారం. ఈ క్రమలో తొలిగా వినిపిస్తున్న నియోజకవర్గం పేరు తాడేపల్లి గూడెం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ నియోజకవర్గంలో సంప్రదాయం అంటూ ఏమీ లేదు.
ఎన్నికల సమయానికి ఎవరి ఊపు ఎక్కువగా ఉంటే.. ఆ పార్టీకి ప్రజలు జై కొడుతున్నారు. ఇక, టీడీపీ విషయానికి వస్తే.. ఎప్పుడైనా.. ఏ పార్టీతోనైనా పొత్తుంటే.. వెంటనే ఆ పార్టీకి కేటాయించేస్తున్నారు. ఈ క్రమంలోనే 2014లో బీజేపీకి కేటాయించారు. అప్పట్లో బీజేపీ తరఫున మాణిక్యాలరావు విజయం దక్కించుకుని రాష్ట్రంలో దేవదాయ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. గత ఎన్నికల్లో మాత్రం టీడీపీ ఒంటరిగా పోటీ చేసింది.
కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని ఇప్పుడు జనసేన కు కేటాయించే అవకాశం మెండుగా ఉందనే ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి అభ్యర్థి పేరు కూడా బయటకు రావడం గమనార్హం. వలవల బాబ్జీ (మల్లికార్జున రావు) పేరు జోరుగా వినిపిస్తోంది. ఈయన టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్తిగా ఇక్కడ పోటీ చేయనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. ఇక, రెండో నియోజకవర్గం విషయానికి వస్తే.. రాజమండ్రి రూరల్.
ఇక్కడ నుంచి జనసేన పార్టీ కీలక నాయకుడు కందుల దుర్గేష్ పేరు ఖరారైంది. వాస్తవానికి టీడీపీకి మం చి పట్టున్న నియోజకవర్గంగా దీనికి పేరుంది. అయినా.. పొత్తులో భాగంగా జనసేన పట్టుబడుతుండడం తో దీనిని ఆ పార్టీకి కేటాయించే చాన్స్ ఎక్కువగా కనిపిస్తోందని తమ్ముళ్లు డిసైడ్ అయ్యారు. అదేవిధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోతిన మహేష్ పేరు ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అయితే.. టీడీపీ నుంచి ఎంపీ కుమార్తె, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు పోటీలో ఉన్నారు. వీరిని అనునయించిన పార్టీ అధినేత.. దీనిని కూడా జనసేనకు ఖరారు చేశారని.. ప్రకటనే తరువాయి అని అంటున్నారు.