విమానాలకు మళ్లీ బెదిరింపులు.. నెంబర్ తెలిస్తే షాకే!

గురువారం కూడా భారీ సంఖ్యలో బెదిరింపులు వచ్చాయి.

Update: 2024-10-24 12:30 GMT

సుమారు గత 11 రోజులుగా దేశీయ సంస్థల విమానాలకు వరుసగా వస్తోన్న బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ పనులకు పాల్పడేవారిని నో-ఫ్లై జాబితాలో చేర్చుతామని.. జీవిత ఖైదు విధించే దిశగా ఆలోచనలు చేస్తున్నామని హెచ్చరికలు వస్తోన్నా.. ఈ పనులకు పాల్పడేవారు తగ్గడంలేదు. గురువారం కూడా భారీ సంఖ్యలో బెదిరింపులు వచ్చాయి.

అవును... విమానాలకు వరుసగా వస్తోన్న బెదిరింపులు ఆగడం లేదు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం నుంచి హెచ్చరికలు వస్తున్నప్పటికీ.. తాజగా మరోసారి పెద్ద సంఖ్యలో విమానాలకు బెదిరింపులు వచ్చాయి. దీంతో.. ఈ విషయం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోందని అంటున్నారు. ఈ క్రమంలో.. గురువారం ఒక్కరోజే 70కి పైగా విమానాలకు ఈ పరిస్థితి ఎదురైనట్లు తెలుస్తోంది.

అంటే... మొత్తంగా గత 11 రోజుల్లో సుమారు 250 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయన్నమాట. వాటిలో ఎయిరిండియా, ఇండిగో, విస్తారా, ఆకాశ ఎయిర్ విమానాలు ఉన్నాయి. ఈ విషయాలపై ఆకాశ ఎయిర్ ప్రతినిధి మాట్లాడుతూ... అక్టోబర్ 24న తమ సంస్థకు చెందిన కొన్ని విమానాలకు బెదిరింపులు వచ్చాయని అన్న్నారు.

ఈ నేపథ్యంలో... వాటిని తమ టీమ్స్ పరిశీలిస్తున్నాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో భద్రత, నియంత్రణ సంస్థల అధికారులతో టచ్ లో ఉన్నట్లు వెల్లడించారు. మరోపక్క ఇండిగో సంస్థ నుంచి కూడా ఇలాంటి స్పందనే వచ్చింది!

మరొపక్క... ఈ బెదిరింపులు గరిష్టంగా సోషల్ మీడియా వేదికగా వస్తోన్న నేపథ్యంలో... ఎక్స్, మెటాతో సహా పలు సోషల్ మీడియా ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వ అధికారులు వర్చువల్ గా భేటీ అయ్యారని తెలుస్తోంది. ఈ సందర్భంగా... నేరాలను ప్రోత్సహిస్తున్నట్లుగా ఎక్స్ తీరు ఉందని మండిపడ్డారని కథనాలొస్తున్నాయి.

కాగా... వరుస బెదిరింపుల నేపథ్యంలో... విమానయాన భద్రతే తమ ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించిన సంగతి తెలిసిందే. ఆయన స్పందించిన 24 గంటల్లోపు మరో 70 బెదిరింపుల వరకూ వచ్చాయని తెలుస్తుండటం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.

Tags:    

Similar News