బాలిక రేప్.. చుక్కలు చూపిస్తున్న మైనర్లు!
బాలిక అత్యాచారం, హత్య జరిగి వారం రోజులవుతున్నా పోలీసులు ఈ కేసును ఛేదించలేకపోయారు
ఆంధ్రప్రదేశ్ లో నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో తొమిదేళ్ల మైనర్ బాలిక అత్యాచారం, హత్యకు సంబంధించి నిందితులైన ముగ్గురు మైనర్లు పోలీసులకు చుక్కలు చూపుతున్నారు. ఒకసారి చంపేసి కాలువలో పడేశామని, ఇంకోసారి పంపు హౌజ్ లో పడేశామని.. శ్మశానంలో పూడ్చిపెట్టామని ఇప్పటిదాకా చెబుతున్న వచ్చిన మైనర్లు తాజాగా బాలికను కృష్ణానదిలో పడేశామని చెబుతున్నారు.
బాలిక అత్యాచారం, హత్య జరిగి వారం రోజులవుతున్నా పోలీసులు ఈ కేసును ఛేదించలేకపోయారు. ముగ్గురు నిందితులు మైనర్లు కావడంతో వారితో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే మైనర్ల వెనుక అసలు నిందితులు ఎవరో ఉన్నారని.. వారే ఈ కథ నడుపుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బాలిక హత్య జరిగిన రోజు సమీపంలో క్షుద్ర పూజలు జరిగిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఆ క్షుద్ర పూజలు జరిపి చిన్నారిని చంపినవారే ఈ ముగ్గురు మైనర్ బాలురిని తాము చెప్పినట్టు నడిపిస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ముగ్గురు మైనర్లు తల్లిదండ్రులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
బాలిక అదృశ్యమై వారం దాటుతున్నా మిస్టరీ వీడకపోవడంతో బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిరసన ప్రదర్శలు చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
ముగ్గురు నిందితుల్లో ఇద్దరు పదో తరగతి విద్యార్థులు, ఒకడు ఆరో తరగతి విద్యార్థి. ముచ్చుమర్రి పార్కులో ఆడుకోవడానికి వచ్చిన బాలికను అత్యాచారం చేసి చంపేశామని.. ఆ తర్వాత కాలువలో తోసేశామని చెప్పారు. దీంతో గజ ఈతగాళ్లను, స్పీడ్ బోట్లను పెట్టి బాలిక మృతదేహం కోసం వెతికించినా ప్రయోజనం దక్కలేదు. దీంతో లాభం లేదని రాష్ట్ర విపత్తు దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్), జాతీయ విపత్తు దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) బృందాలను కూడా రంగంలోకి దిగారు. అయినా ప్రయోజనం శూన్యం. స్వయంగా డీఐజీనే రంగంలోకి దిగి సీన్ రీక్రియేట్ చేసినా ఫలితం దక్కలేదు.
అయినప్పటికీ పోలీసులు బాలిక మిస్సింగ్ పై సంఘమేశ్వరం, మల్లాల తదితర ప్రాంతాల్లో భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ కేసు మిస్టరీగానే ఉంటుందా? లేక పోలీసులు ఛేదిస్తారా? అనేది వెల్లడి కావాల్సి ఉంది. వారం దాటిపోయినా చిన్నారి ఆచూకీ లభించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జూలై 7న నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్త ఎల్లాలకు చెందిన తొమ్మిదేళ్ల బాలికపై అదే మండలం కొత్త ముచ్చుమర్రి గ్రామానికి చెందిన ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారం చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే. పార్కులో ఆడుకోవడానికి వెళ్లిన బాలిక ఆదివారం ఉదయం నుంచి కనిపించకుండా పోయింది. దీంతో జూలై 7 రాత్రి బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పార్కు సిబ్బందిని కూడా పోలీసులు అదుపులోకి విచారించినా ఫలితం తేలలేదు.