తుమ్మలకు స్పీకర్.. లెక్కలు ఇవేనా?

అనూహ్యంగా చోటు చేసుకునే పరిణామాలు కొన్నిసార్లు ఆసక్తికర అంశాలకు కారణమవుతాయి. కొత్త సమీకరణాలకు తెర తీస్తాయి.

Update: 2023-12-04 07:52 GMT

అనూహ్యంగా చోటు చేసుకునే పరిణామాలు కొన్నిసార్లు ఆసక్తికర అంశాలకు కారణమవుతాయి. కొత్త సమీకరణాలకు తెర తీస్తాయి. తాజాగా కొలువు తీరనున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో అసెంబ్లీ స్పీకర్ గా ఎవరు కానున్నారు? అన్నది ప్రశ్నగా మారింది. దీనిపై బోలెడన్ని విశ్లేషణలు వినిపిస్తున్నా.. ఒక వాదన మాత్రం వాస్తవానికి దగ్గరగా ఉండటమే కాదు.. లాజిక్ కు సరిపోతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సభాపతిగా సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు కాక తప్పదంటున్నారు. ఆయన్నుఎంపిక చేయటం ద్వారా కొన్ని చిక్కుముడుల్ని ఈజీగా విప్పే వీలుందన్న మాట వినిపిస్తోంది.

తుమ్మల గురించి తెలిసిందే. మొదట్నించి తెలుగుదేశంలో ఉండటం.. తర్వాతి కాలంలో కేసీఆర్ చొరవతో గులాబీ కారు ఎక్కిన ఆయన గత ఎన్నికల్లో ఓడిపోవటం తెలిసిందే. ఆ తర్వాత ఆయనకు ప్రాధాన్యతను తగ్గించిన కేసీఆర్.. ఆ తర్వాతి కాలంలో ఆయన పట్ల వ్యవహరించిన తీరుకు తీవ్రమైన మానసిక వేదనకు గురైనట్లుగా చెబుతున్నారు. ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ కు సరైన సమాధానం చెప్పాలన్న పట్టుదలతో ఉన్న తుమ్మల.. తన రోటీన్ స్టైల్ కు భిన్నంగా మరింత దూకుడును ప్రదర్శించారని చెబతారు.

అందుకు తగ్గట్లే తాజాగా గెలుపొందిన తుమ్మలకు మంత్రి పదవి ఖాయమన్నమాట బలంగా వినిపిస్తోంది. అయితే..ఇక్కడో చిక్కుముడి వచ్చి పడింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరో ఇద్దరు కూడా మంత్రులుగా రేసులో ఉండటంతో తుమ్మలకు స్పీకర్ పదవి ఇవ్వటం ఖాయమన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. మల్లు భట్టివిక్రమార్క ఇద్దరు కూడా మంత్రి పదవి కోసం రేసులో ఉండటం.. తుమ్మలను కలిపితే ముగ్గురుకావటం.. ఒకే జిల్లాకు మూడు మంత్రి పదవులు ఇవ్వటం అసాధ్యమైన పరిస్థితి.

దీంతో.. మధ్యేమార్గంగా తుమ్మలను స్పీకర్ పదవిని ఇవ్వటం.. మల్లు భట్టివిక్రమార్క.. పొంగులేటిని కేబినెట్ లోకి తీసుకోవటం ద్వారా చిక్కుముడులు సరిచేసి.. లెక్కలు పక్కాగా ఉండేలా చేస్తారని చెబుతున్నారు. మరి.. స్పీకర్ పదవికి తుమ్మల రియాక్షన్ ఏమిటన్నది ఒకటైతే.. ఒకప్పుడు తనను పిచ్చ లైట్ తీసుకున్న కేసీఆర్.. తుమ్మల స్పీకర్ అయితే అధ్యక్షా అని పలుకుతూ సభలో మాట్లాడగలరా? అన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.

Tags:    

Similar News