3 నియోజకవర్గాలు.. 3 పార్టీలు.. 4 సీఎంలు.. ఆ మంత్రిది చెరగని రికార్డు!

ఒక పార్టీలో ఉన్నప్పటికీ.. పలుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ.. ఒకసారి మంత్రి పదవి దక్కడమే కష్టం

Update: 2023-12-07 12:30 GMT

ఒక పార్టీలో ఉన్నప్పటికీ.. పలుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ.. ఒకసారి మంత్రి పదవి దక్కడమే కష్టం. సామాజిక, ఇతర సమీకరణాలతో మంత్రి యోగం మిస్ అవుతూ ఉంటుంది. రెండు రాష్ట్రాల్లోనూ మంత్రిగా అవకాశం వస్తుందా? అంటే చెప్పలేం.. ఇక ఇద్దరు సీఎంల వద్ద అమాత్యుడిగా పనిచేయడం అంటే కొద్దిగా కష్టం.. మూడు వేర్వేరు నియోజకవర్గాల నుంచి గెలిచి మంత్రి పదవి అందుకోవడం అసాధ్యం.. మూడు వేర్వేరే పార్టీల తరఫున మంత్రి కావడం మహా రికార్డు.. ఇదంతా ఆయనకు సాధ్యమైంది..

తమ్మల.. మజాకా..?

ఉమ్మడి ఖమ్మంలో గట్టి పట్టున్న తుమ్మల నాగేశ్వరరావు మరోసారి మంత్రి అయ్యారు. అదికూడా ఎవరికీ సాధ్యం కాని రికార్డుతో...? ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలో మంత్రిగా ఉండడమే కాదు.. నలుగురు సీఎంలు.. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్, రేవంత్ వద్ద మంత్రివర్గంలో ఉన్న రికార్డు సొంతమైంది. మరోవైపు మూడు పార్టీలు టీడీపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో తుమ్మల మంత్రి పదవులు చేపట్టారు. ఇది కూడా ఎవరికీ సాధ్యం కానిదే. ఇక సత్తుపల్లి, పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల నుంచి గెలిచిన రికార్డు తుమ్మలది. ఈ మూడు నియోజకవర్గాల నుంచి కూడా ఆయన మంత్రి కావడం మరో రికార్డు.

1985 నుంచి..

ఉమ్మడి ఖమ్మంలో కాంగ్రెస్ 8 స్థానాలు నెగ్గింది. సీపీఐ ఒక స్థానంలో విజయం సాధించింది. బీఆర్ఎస్ భద్రాచలం లో గెలిచింది. కాగా, తమ్మల ఖమ్మం నుంచి రెండోసారి గెలుపు అందుకుని మంత్రి అయ్యారు. 1985లో తొలిసారి ఎన్టీఆర్ కేబినెట్ లో, 1994-2004 మధ్య ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో, 2015లో కేసీఆర్ కేబినెట్ లో ఆయన మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు రేవంత్ సారథ్యంలో ఏర్పడిన ప్రభుత్వంలోనూ మంత్రి అయ్యారు. 1985 నుంచి చూస్తే మొత్తం 17 ఏళ్లకు పైగా మంత్రిగా కొనసాగారు తుమ్మల. ఇక మరో ఐదేళ్లు కూడా కలుపుకొంటే 22 ఏళ్లు అవుతుంది.

నీటి పారుదల.. లేదంటే.. రోడ్లు భవనాలు

తుమ్మలకు మొదటి వచ్చిన శాఖ నీటి పారుదల, ఆపై రోడ్లు భవనాలు. మధ్యలో ఎక్సైజ్ మంత్రిగానూ పనిచేశారు. ఇప్పుడు మళ్లీ ఆయనకు రోడ్లు భవనాల శాఖనే రావడం విశేషం. కాగా, ఈ శాఖ మంత్రిగా తమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మంలో రహదారుల నిర్మాణానికి విశేషంగా పాటుపడ్డారు. నక్సల్స్ ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లోనూ రహదారులను నిర్మించారన్న పేరును తెచ్చుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఖమ్మం మీదుగా ఏపీ, ఇతర రాష్ట్రాలకు నాలుగు రహదారుల నిర్మాణం జరుగుతోంది. ఇదే సమయంలో తుమ్మల ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కావడం గమనార్హం.

Tags:    

Similar News