తుమ్మలకు ఆ పార్టీ నేతల నుంచి ఆహ్వానాల వెల్లువ!
అయితే ఆదిలోనే హంసపాదు అన్నట్టు ఖమ్మం జిల్లాలో కేసీఆర్ కు ఈసారి గట్టి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిచి ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కలలు కంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల అన్ని పార్టీల కంటే ముందుగా 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఇంకా కేవలం నాలుగు స్థానాలకు మాత్రమే కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
అయితే ఆదిలోనే హంసపాదు అన్నట్టు ఖమ్మం జిల్లాలో కేసీఆర్ కు ఈసారి గట్టి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఖమ్మం జిల్లాను ప్రభావితం చేయగల మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్‌ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతోపాటు అనేక పదవుల్లో ఉన్న నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాగా ఇప్పుడు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వంతు వచ్చింది. కేసీఆర్ తాజాగా ప్రకటించిన జాబితాలో తుమ్మలకు సీటు లభించలేదు. కమ్మ సామాజికవర్గానికి చెందిన తుమ్మలకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనుచరులున్నారు.
గతంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి 1985, 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ తరఫున తుమ్మల నాగేశ్వరరావు గెలుపొందారు. 2009లో టీడీపీ తరఫున ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. 2016లో టీఆర్‌ఎస్ లో చేరి పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నికలో తుమ్మల విజయం సాధించారు. మళ్లీ 2018 ఎన్నికల్లో పాలేరు నుంచి టీఆర్‌ఎస్ తరఫున ఓడిపోయారు.
గతంలో టీడీపీ ప్రభుత్వాల హయాంలో తుమ్మల నాగేశ్వరరావు భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా, రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా 2015లో కేసీఆర్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కాకుండానే తుమ్మలను రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా తన కేబినెట్ లోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు.
కాగా 2018 ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి తుమ్మలకు ఎలాంటి పదవులు లభించలేదు. బీఆర్‌ఎస్ లో ఆయనను పట్టించుకునేవారే కరువయ్యారు. ఇటీవల కేసీఆర్ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టులోనూ తుమ్మల పేరు లేదు. దీంతో తాజాగా తుమ్మల తన అనుచరులతో ఖమ్మంలో సమావేశమయ్యారు. దీనికి 2,000 కార్లలో అనుచరులు హాజరయ్యారు. ఆయన అభిమానులు భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా తాను వచ్చే ఎన్నికల్లో నిలబడతా అని తుమ్మల నాగేశ్వరరావు సంచలన ప్రకటన చేశారు. తన శిరస్సు నరుక్కుంటాను తప్ప తన వల్ల తన అభిమానులు ఎవరూ తలదించుకోవద్దన్నారు.
దీన్ని బట్టి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్‌ఎస్ కు రాజీనామా చేస్తారని తెలుస్తోంది. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని అంటున్నారు. మరోవైపు ఖమ్మం జిల్లాకు కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి కూడా తుమ్మలను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఆయన వస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.
అలాగే తెలంగాణ ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా గతంలో టీడీపీలో ఉన్నవారే. తుమ్మల టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ కూడా తుమ్మలతో మాట్లాడినట్టు చెబుతున్నారు.
అలాగే ప్రస్తుతం ఖమ్మం జిల్లా మధిర ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ లెజిస్లేటివ్ నేతగా ఉన్న భట్టి విక్రమార్క సైతం తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని అంటున్నారు. గతంలో తుమ్మల.. ఎన్టీ రామారావు, చంద్రబాబు, కేసీఆర్ మంత్రివర్గాల్లో కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో పార్టీలకతీతంగా వివిధ పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓవైపు కాంగ్రెస్ నేతలతోపాటు బీజేపీ నేతలు కూడా ఆయనను తమ పార్టీల్లోకి ఆహ్వానిస్తున్నారు.
కాంగ్రెస్ లో చేరితే తుమ్మలకు పాలేరు అసెంబ్లీ సీటు ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తుమ్మల అడుగులు సైతం ఆ పార్టీ వైపే ఉంటాయని టాక్ నడుస్తోంది.