ఫైనల్ ఓటమి వేళ.. బాధ నుంచి బయటకు వచ్చేందుకు సెలవు ఇచ్చేశారు

ఇదిలా ఉంటే గురుగ్రామ్ కు చెందిన ఒక మార్కెటింగ్ కంపెనీ ఫైనల్లో టీమిండియా ఓటమి వేళ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

Update: 2023-11-21 05:04 GMT

దేశంలో క్రికెట్ కు ఉండే ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరే క్రీడకు లేనంతగా.. క్రికెట్ ను తమ జీవితంలో ఒక భాగంగా భావించే ప్రజలు మన దేశంలో కోట్లాది మంది ఉన్నారు. వన్డే ప్రపంచకప్ లాంటి కీలక టోర్నీలో దుమ్ము రేపుతూ ఫైనల్ కు చేరిన వేళ.. కప్ పట్టుకునే మ్యాచ్ లో ఓడిపోతే.. దానికి సంబంధించిన బాధ ఎంతన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఓటమి సగటు భారతీయుడ్ని వేధించిది. దాని నుంచి తేరుకోవటానికి కాస్త సమయం తీసుకుంది.

ఇదిలా ఉంటే గురుగ్రామ్ కు చెందిన ఒక మార్కెటింగ్ కంపెనీ ఫైనల్లో టీమిండియా ఓటమి వేళ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటివరకు టీమిండియా ఆడే కీలక మ్యాచ్ ను చూసేందుకు వీలుగా సెలవును ఇవ్వటం చూస్తున్నాం. అందుకు భిన్నంగా కీలక మ్యాచ్ ఓడిన వేళ.. వేదనతో ఉన్న అభిమానులు ఆ బాధ నుంచి బయటకు వచ్చేందుకు వీలుగా కంపెనీకి సెలవు ప్రకటించటం విశేషం. ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోవటాన్ని ప్రస్తావించిన సదరు కంపెనీ.. ఆ షాక్ నుంచి తేరుకోవటానికి కాస్త సమయం అవసరమని పేర్కొంది.

ఇందులో భాగంగా సోమవారం సంస్థకు సెలవును ప్రకటిస్తూ నిర్ణయాన్ని తీసుకుంది. దీనికి సంబంధించిన ఈ మొయిల్ ను ఉద్యోగులకు పంపింది. ఇదే విషయాన్ని ఒకరు తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్టు పెట్టటంతో ఈ పోస్టు వైరల్ గా మారింది. ‘‘నిన్నటి బాధ నుంచి కోలుకునేందుకు సెలవు తీసుకోండి’’ అంటూ సోమవారం ఉదయం సంస్థ ఉద్యోగులకు మొయిల్ పంపిన కంపెనీ నిర్ణయాన్ని పలువురు మద్దతు పలకటం గమనార్హం.

ఎవరైనా మ్యాచ్ చూసేందుకు సెలవు ఇస్తారని.. కానీ మ్యాచ్ ఓడిపోతే ఆ వేదన నుంచి బయటకు వచ్చేందుకు సెలవు ఇవ్వటాన్ని పలువురు సమర్థిస్తున్నారు. అనూహ్యంగా ఎదురైన ఓటమి ఇచ్చే షాక్ నుంచి బయటకు వచ్చేందుకు కాస్త టైం పడుతుందని.. ఆ విషయాన్ని సదరు సంస్థ అర్థం చేసుకుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఓటమి వేదన నుంచి కోలుకోవటానికి సెలవు ఇవ్వటం అభినందించాల్సిన అంశంగా పేర్కొంటున్నారు. ఇక.. ఫైనల్ లో టీమిండియా ఓటమి నేపథ్యంలో ఒక అభిమాని గుండెపోటుతో మరణించగా.. అసోంలోని గౌహతిలోని ఒక ఐటీఐ విద్యార్థి సూసైడ్ చేసుకోవటం తెలిసిందే.

Tags:    

Similar News