భూమన, వైవీ సేఫ్?! వైసీపీ ముఖ్యనేతకు ముప్పు

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న కేసులో దర్యాప్తు చేపట్టిన సిట్ అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్లు చెబుతున్నారు.

Update: 2025-02-17 10:45 GMT

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న కేసులో దర్యాప్తు చేపట్టిన సిట్ అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేయగా, వారిలో రాష్ట్రానికి చెందిన వారు కానీ, తిరుమల ఆలయానికి సంబంధించి కానీ ఎవరూ లేరు. అయితే టీటీడీలో కీలకంగా పనిచేసిన ఓ అధికారితోపాటు వైసీపీకి చెందిన ఓ ముఖ్య నేతకు ఈ వ్యవహారంతో లింకు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఏ క్షణమైనా వారిని అరెస్టు చేస్తారంటూ చెబుతున్నారు. అంతేకాకుండా ఆ ఇద్దరు దేశం విడిచి పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు.

కల్తీ నెయ్యి సరఫరా ఆరోపణలో బోలేబాబా డెయిరీతోపాటు వైష్ణవి, ఏఆర్ డెయిరీ డైరెక్టర్లు, సీఈవోలను సిట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరిని కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసు అధికారులు.. ఈ వ్యవహారంతో లింకులున్న ఇతరులకు సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారంటున్నారు. ప్రస్తుతానికి పాత్రధారులు అరెస్టు అయినా, సూత్రధారులను అరెస్టు చేయాల్సివుందని అంటున్నారు. కస్టడీలో ఉన్న నిందితులు ఇచ్చిన సమాచారం ప్రకారం గతంలో టీటీడీలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరి పాత్రపై స్పష్టమైన ఆధారాలు లభించినట్లు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో పాలకమండలి సభ్యుడిగా నియమితుడైన ఓ సభ్యుడితోపాటు అప్పట్లో తిరుమల వ్యవహారాల్లో చక్రం తిప్పిన ఓ ఉన్నతాధికారిపై సిట్ అధికారులకు అనుమానాలు ఉన్నాయంటున్నారు.

వీరిద్దరిని విచారించేందుకు త్వరలో నోటీసులు ఇస్తారని, అప్పుడే అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది. కల్తీ నెయ్యి సరఫరా ఒప్పందాల్లో ఈ ఇద్దరికి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని ప్రధాన పత్రికల్లోనూ వార్తలు వస్తున్నాయి. గత పాలకమండలిలో అత్యంత కీలకంగా వ్యవహరించిన పాలకమండలి సభ్యుడితో టీటీడీ అధికారికి మంచి సంబంధాలు ఉండేవని, వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు బంధుత్వంగా మారే వరకు వెళ్లిందని అంటున్నారు. దీంతో వీరిద్దరి బ్యాంకు అకౌంట్స్ డిటైల్స్ ను సిట్ పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. అదేవిధంగా డెయిరీ నిర్వాహకులు, టీటీడీ అధికారులు, వీరి మధ్యపరిచయానికి ఉపయోగపడిన వ్యక్తుల ఫోన్ కాల్ డేటాను తెప్పించుకున్నారని అంటున్నారు. మొత్తంగా కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆ ఇద్దరి అరెస్టుతో ఈ ఎపిసోడ్ కు పుల్ స్టాప్ పడుతోందని అంటున్నారు.

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి వాడారంటూ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే బయటపెట్టింది. గత జూలైలో ఈ విషయం వెలుగుచూడగా, లడ్డూ నాణ్యతపైన తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ కేసులో వైసీపీ ముఖ్యనేతలను టార్గెట్ చేస్తూ ప్రభుత్వం పావులు కదిపిందనే అభిప్రాయం వ్యాపించింది. అయితే దీనిపై కొందరు వ్యక్తులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా, కోర్టు సీబీఐ, ఏపీ పోలీసులతో కలిపి ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో గతంలో టీటీడీ పాలకమండలి అధ్యక్షులుగా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిని టార్గెట్ చేసినట్లు వైసీపీ ఆరోపణలు చేసింది. ఈ వ్యవహారంలో తన నిజాయితీని నిరూపించుకునేందుకు శ్రీవారి ఆలయం ఎదుట ప్రమాణం చేస్తానని భూమన ప్రకటించడం, అప్పట్లో ప్రభుత్వం అందుకు అనుమతి ఇవ్వకపోవడం రాజకీయంగా దుమారం రేపింది.

ఇలాంటి పరిస్థితుల్లో పాలకమండలి అధ్యక్షులకు ఈ వ్యవహారానికి సంబంధం లేనట్లు సిట్ దర్యాప్తులో నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. కేవలం ఓ అధికారి, పాలకమండలి సభ్యుడు కలిసి ఈ తతంగం నడిపినట్లు సిట్ తేల్చినట్లు తాజా వార్తలు బయటపెడుతున్నాయి. దీంతో వైవీ, భూమన ప్రస్తుతానికి సేఫ్ అంటూ చెబుతున్నారు. ఇక కల్తీ నెయ్యి డీల్ కుదర్చిన పాలకమండలి మాజీ సభ్యుడు ఎవరంటూ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా, టీటీడీకి జంబో పాలకవర్గం నియమించింది. దీంతో ఎవరు ఏం చేస్తున్నారనే విషయమై ప్రభుత్వానికి నియంత్రణ లేకపోయిందని అంటున్నారు. మొత్తానికి కల్తీ నెయ్యి సరఫరా కేసులో తాజా అప్డేట్ వైసీపీకి షాక్ ఇచ్చేలా కనిపిస్తోందని అంటున్నారు.

Tags:    

Similar News