తిరుమలేషుడి చెంతనే టీటీడీ బోర్డు మెంబర్ తిట్ల పురాణం.. వైరల్ వీడియో
తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఓ వివాదం ఈరోజు చోటు చేసుకుంది..
తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఓ వివాదం ఈరోజు చోటు చేసుకుంది.. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబెర్ గా చెప్పుకుంటున్న ఒక వ్యక్తి.. సిబ్బందిపై పరుషంగా మాట్లాడిన ఒక వీడియో తాజాగా వైరల్ అయ్యింది. శ్రీవారి సన్నిధిలోనే టీటీడీ ఉద్యోగిపై టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ పరుష పదజాలంతో తిట్టిపోసిన వైనం కెమెరాకు చిక్కింది.
మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్న టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్, అనంతరం తమవారితో కలిసి మహాద్వారం వద్దకు చేరుకున్నారు. అక్కడే ఉన్న టీటీడీ ఉద్యోగి బాలాజీ మహాద్వారం గేటు ద్వారా ఎవరినీ పంపడం లేదని, అభ్యంతరం ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించాలని సమాధానమిచ్చాడు.
*తిట్లపురాణం అందుకు టీటీడీ బోర్డు మెంబర్
దీంతో సహనం కోల్పోయిన బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ ‘థర్డ్ క్లాస్ నా కొడుకువి, నిన్ను ఇక్కడ పెట్టిందెవరు, ఏమనుకుంటున్నావు? ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా? ఏయ్ ముందు నువ్వు బయటకు పో’ అంటూ ఉద్యోగిపై బహిరంగంగా తిట్లపురాణం అందుకున్నాడు. ఈ ఘటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భక్తులు, నెటిజన్లు టీటీడీ బోర్డు సభ్యుడి ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నారు. అధికారాన్ని ఉపయోగించడం సరికాదని, ఆలయంలో మర్యాదగా ప్రవర్తించడం అనివార్యమని వాదిస్తున్నారు.
- టీటీడీ స్పందన ఏంటి?
ఈ వ్యవహారంపై టీటీడీ అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. అయితే, దీనిపై దర్యాప్తు జరిపి సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకునే అవకాశం ఉంది. భక్తుల పరిపాలనలో, ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా ఎవరైనా ప్రవర్తిస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
- మరెన్నో వివాదాలు?
ఇది కొత్తేమీ కాదు. గతంలోనూ టీటీడీ అధికారులపై, రాజకీయ నేతలపై భక్తులకు, ఉద్యోగులకు అవమానకర ప్రవర్తన చేశారని ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అలాంటి ఘటనలు మరోసారి టీటీడీని వార్తల్లో నిలిపేలా చేస్తున్నాయి. అధికారిక హోదాలో ఉన్నవారైనా, ఆలయ నియమాలు ఉల్లంఘిస్తే, వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేవస్థానం పవిత్రతను కాపాడేందుకు, భక్తులకు అసౌకర్యం కలిగించకుండా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.