తిరుపతి లడ్డూ...లేటెస్ట్ అప్డేట్ ఇదే !
ఈ విచారణ కమిటీలో సీబీఐ నుంచి హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్ ఎస్వీ వీరేష్ ప్రభు, విశాఖపట్నంలోని సీబీఐ ఎస్పీ మురళీ రంభ లను నియమించారు.
కలియుగ దైవం తిరుమల తిరుపతి దేవ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ జరిగింది అని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించిన నేపథ్యంలో దీని మీద వైసీపీ కోర్టుకు ఎక్కిన సంగతి తెలిసిందే. ఇక సుప్రీంకోర్టు అయిదుగురు సభ్యులతో విచారణ చేయించాలని ఆదేశించింది.
ఇదంతా జరిగి దాదాపుగా నెలన్నర గడచింది. ఇపుడు ఈ విషయంలో సరికొత్త అప్డేట్ చోటు చేసుకుంది. సిట్ సభ్యులు నియామకం తాజాగా జరిగింది. ఈ విచారణ కమిటీలో సీబీఐ నుంచి హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్ ఎస్వీ వీరేష్ ప్రభు, విశాఖపట్నంలోని సీబీఐ ఎస్పీ మురళీ రంభ లను నియమించారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ్ త్రిపాఠి, విశాఖపట్నం రేంజి డీఐజీ గోపీనాథ్ జెట్టి లను సిట్ సభ్యులుగా నియమించింది. అయితే ఫుడ్ సేఫ్టీ సభ్యుడిని మాత్రమే ఇంకా ప్రకటించాల్సి ఉంది.
సీబీఐ డైరక్టర్ పర్యవేక్షణలో సిట్ బృందం తొందరలోనే విచారణ చేయనుందని చెబుతున్నారు. దాంతో దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పవర్ ఫుల్ కమిటీ అయితే ఏర్పాటు అయినట్లే. ఇక ఈ కమిటీ సాధ్యమైనంత త్వరలోనే తన విచారణను మొదలెడుతుందని అంటున్నారు.
ఈ విచారణ కమిటీ సిట్ కోసం తిరుపతిలో ఒక ప్రత్యేక ఆఫీసుని కూడా ఏర్పాటు చేస్తారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అని ఆరోపణల నేపధ్యంలో ఒక్కసారిగా దేశమంతా అట్టుడికింది.
ఇది జాతీయ స్థాయిలో విశేష చర్చకు తావిచ్చింది. అదే సమయంలో జంతువుల అవశేషాలు నెయ్యిలో ఉన్నాయన్న దానితో ఆధ్యాత్మిక పరులు భక్తులు అంతా తీవ్రంగా కలత చెందారు. ఈ విషయంలో అసలు వాస్తవాలు వెలికి తీయాలని అయిదురు కోర్టుకు వెళ్లారు. వైసీపీ తరఫున వైవీ సుబ్బారెడ్డి, బీజేపీకి చెందిన మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి, ఉత్తరాదికి చెందిన మరో ముగ్గురు పిటిషన్లు దాఖలు చేయగా అన్నీ కలసి సెప్టెంబర్ చివరి వారంలో సుప్రీం కోర్టు విచారణ జరిపి సిట్ ని కొత్తగా ఏర్పాటు చేయాలని కీలక అదేశాలు జారీ చేసింది. సో ఇపుడు సిట్ సభ్యులు కూడా నియమితులయ్యారు. తొందరలో తిరుపతి లడ్డూ కల్తీ విషయంలో వాస్తవాలు ఏంటో సిట్ చేదించనుంది అని అంటున్నారు.