తిరుమల లడ్డూలో పొగాకు.. తెరపైకి కొత్త సందేహాలు!
ఈ నేపథ్యంలో తాజాగా ఖమ్మం జిల్లా వాసికి చేదు అనుభవం ఎదురైంది. తిరుమల లడ్డూలో పొగాకుతో కూడిన ప్యాకెట్ కనిపించింది.
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలన విషయంగా మారిన సంగతి తెలిసిందే. శ్రీవారి లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని.. అందులో గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె వంటివి కలిసినట్లు ఆరోపణలు తెరపైకి రావడంతో ఈ విషయం సంచలనంగా మారింది.
ఈ వ్యవహారంపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ఇలాంటి పనికి పూనుకున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఈ వ్యవహారంపై వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ విషయాన్ని వదిలి పెట్టకుండా కచ్చితంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇలా... గతంలో ఎన్నడూ లేని విధంగా శ్రీవారి లడ్డూ ప్రసాదంలోని నెయ్యి వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయాలంటూ డిమాండ్ లు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఖమ్మం జిల్లా వాసికి చేదు అనుభవం ఎదురైంది. తిరుమల లడ్డూలో పొగాకుతో కూడిన ప్యాకెట్ కనిపించింది.
అవును... కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖమ్మం రూరల్ మండలంలోని గొల్లగూడేం గ్రామానికి చెందిన దొంతు పద్మావతి బంధువులతో కలిసి ఈ నెల 19న తిరుమల వెళ్లారు.
అక్కడ 20న సర్వదర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం లడ్డూలు కొనుగోలు చేసి తిరిగి ఇంటికి చేరుకున్నారు. అయితే ఆ ఉదయం లడ్డూ ప్రసాదాన్ని ఇంట్లో దేవుడి వద్ద ఉంచి, బంధువులకు ఇచ్చేముందు కొద్దిగా నోట్లో వేసుకోగా పొగాకు వాసన వచ్చిందంట. దీంతో... ఆమె మొత్తం లడ్డూ చూడగా అందులో పొగాకుతో కూడిన ప్యాకెట్ కనిపించిందని చెబుతున్నారు.
దీంతో... పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలో ఇలా పొగాకు ప్యాకెట్ కనిపించడంపై పద్మావతి సహా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆ సంగతి అలా ఉంటే... తిరుమల లడ్డూ ప్రసాదంలో ఏకంగా పొగాకు ప్యాకెట్ కనబడటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కచ్చితంగా విచారణ జరగాలని భక్తులు కోరుతున్నారు. ఇది నిజంగానే జరిగిందా.. లేక, కల్తీ నెయ్యి వివాదాన్ని డైవర్ట్ చేసే ప్రక్రియలో భాగంగా ఈ ఘటన తెరపైకి తెచ్చారా అనే సందేహాలు పలువురు వ్యక్తపరుస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే... గతంలో ఎన్నడూ లేని విధంగా స్వామివారి లడ్డూ ప్రసాదం ఇంత వివాదాస్పదమవుతున్న వేళ ఈ లడ్డూలో పొగాకు ప్యాకెట్ వ్యవహారాన్ని పూర్తిగా విచారణ చేయాలని.. నిజానిజాలు భక్తులకు వెళ్లడించాలని.. దీన్ని ఒక వార్తగా కాకుండా, కోట్ల మంది భక్తుల మనోభావంగా, నమ్మకంగా చూడాలని కోరుతున్నారు.