మార్చి చివరకు ‘టోల్’ స్వరూపమే మారిపోనుందా?
ఇంటి నుంచి రోడ్డు మీదకు వచ్చి.. దూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు ఎవరైనా.. నగరాల్లో నివాసం ఉండే వారికి తరచూ ఎదరయ్యే ‘టోల్’ వ్యవహారం గురించి తెలిసిందే.
ఇంటి నుంచి రోడ్డు మీదకు వచ్చి.. దూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు ఎవరైనా.. నగరాల్లో నివాసం ఉండే వారికి తరచూ ఎదరయ్యే ‘టోల్’ వ్యవహారం గురించి తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన ఫాస్ట్ టాగ్ కారణంగా గతంలో పోలిస్తే.. ఇప్పుడు వాహనాల్ని టోల్ గేట్ల వద్ద నిలిపి ఉంచే టైం తగ్గింది. అయితే.. పూర్తిగా తగ్గలేదన్నది నిజం. పండుగలు.. పర్వదినాలు.. ప్రత్యేక సమయాల్లో వాహన రద్దీ ఎక్కువగా ఉంటే.. ఇప్పటికి టోల్ దగ్గర వెయిట్ చేసే పరిస్థితి. అయితే.. ఇలాంటి సమస్య వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి మొత్తంగా మారిపోనుంది.
దీనికి కారణం.. టోల్ వసూలు చేసే పద్దతి మొత్తంలోనూ మార్పు రావటమే. వచ్చే మార్చి చివరి నాటికి జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థలతో పాటు సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో.. టోల్ గేట్ల దగ్గర ఇప్పుడున్న విధానంలో మార్పు రానుంది. ఈ విషయాన్ని తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ నియంత్రణ కోసం కొత్త విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు.
టోల్ గేట్ల వద్ద తరచూ ఏర్పడే సమస్యల్లో ముఖ్యమైనది.. ఎక్కువ సేపు వెయిట్ చేయాల్సి రావటం.. కచ్ఛితమైన ఛార్జీలను వసూలు చేసే అంశంపై ఫిర్యాదులు అందుతుంటాయి. టోల్ సిబ్బంది దురుసు ప్రవర్తన కూడా పలుమార్లు చర్చకు వస్తుంటుంది. త్వరలో అందుబాటులోకి వచ్చే సరికొత్త సాంకేతకత పుణ్యమా అని.. టోల్ వ్యవస్థ స్వరూపమే మారిపోనుంది.
ప్రస్తుతం ఉన్న టోల్ ప్లాజాల స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. దీంతో.. వాహనాలకు విధించే టోల్ ఛార్జీల్లో కచ్ఛితత్వం కూడా పెరగనుంది. ఒక అంచనా ప్రకారం 2018-19 లో టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు వెయిట్ చేసే సమయం సగటున 8 నిమిషాలు. తర్వాతి కాలంలో తీసుకొచ్చిన మార్పుల కారణంగా ఇది కాస్తా 47 సెకన్లకు తగ్గింది. మరో మూడునెలల్లో అందుబాటులోకి వస్తే సరికొత్త సాంకేతికత కారణంగా.. టోల్ ప్లాజా వద్ద వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ప్లాజాల వద్ద ఏర్పాటు చేసే అత్యాధునిక స్కానింగ్ వ్యవస్థతో.. వాహనం నెంబరును నోట్ చేసుకొని.. రియల్ టైంలో వసూళ్లను అప్పటికప్పుడు పూర్తి చేస్తారు. ఈ క్రమంలో ఫాస్టాగ్ కీలక భూమిక పోషిస్తుందని చెబుతున్నారు.