మిర్చి మంట-టమాటా తంటా.. కూటమికి కునుకు కరువు!
కూటమి సర్కారుకు సెంటిమెంటుతో కూడిన తీవ్ర సమస్య తెరమీదికి వచ్చింది. నిత్యావసరాల్లో కీలకమైన టమాటా.. మిర్చి ధరలు గతానికి భిన్నంగా పతనం కావడంతో ప్రభుత్వానికి ఇవి రెండు సవాళ్లను విసురుతున్నాయి.
కూటమి సర్కారుకు సెంటిమెంటుతో కూడిన తీవ్ర సమస్య తెరమీదికి వచ్చింది. నిత్యావసరాల్లో కీలకమైన టమాటా.. మిర్చి ధరలు గతానికి భిన్నంగా పతనం కావడంతో ప్రభుత్వానికి ఇవి రెండు సవాళ్లను విసురుతున్నాయి. రైతుల నుంచి ఎదురవుతున్న డిమాండ్లు, నిరసనలు, దీనికి ప్రతిపక్ష పార్టీల విమర్శలు.. కూటమి ప్రభుత్వానికి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. మిర్చి రైతుల సమస్యలు పరిష్కరించేందుకు సీఎం చంద్రబాబు ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ సమస్యపై విపక్షం రోడ్డెక్కింది. ఇంతలోనే.. టమాటా రూపంలో మరో సమస్య.. కూటమికి ఎదురైంది. తాజాగా టమాటా ధరలు భారీగా పతనమయ్యాయి. టమాటా ఎక్కువగా పండించే మదనపల్లె మార్కెట్‌లో కిలో రూ.2కు పడిపోయింది. వాస్తవానికి ఇలా పడిపోవడం కామనే అయినా.. అది సహజంగా సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో కనిపిస్తుంది. కానీ, ఈ ఏడాది.. ఇప్పుడే ప్రారంభం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వీరి వ్యవహారం సెంటిమెంటుతో కూడుకున్నది కావడంతో సీఎం తర్జన భర్జన పడుతున్నారు.
మిర్చి విషయానికి వస్తే.. ఈ ఏడాది కూడా భారీగానే పంటలు పండాయి. అయితే.. మిర్చికి కేంద్రం నుంచి ఎలాంటి మద్దతు ధరలేదు. కేవలం రాష్ట్రాలే మద్దతు ప్రకటిస్తాయి. ఇలా చూసుకున్నా.. రాష్ట్రంలో మద్దతు ధర క్వింటాకు 7000గా ఉంది. కానీ, ఇలా అమ్మితే.. కనీసం విత్తనం ఖర్చు కూడా రైతుకు రాదనే వాదన ఉంది. దీంతో మార్కెట్ ధరలపై రైతులు ఎక్కువగా ఆధారపడతారు. అయితే.. ఈ సారి మార్కెట్ ధరలకే.. 7000లకు మించడం లేదు. దీంతో రైతులు అటు అమ్మలేక, నిల్వ చేసుకునే అవకాశం లేక తిప్పలు పడుతున్నారు.
ఇదిలా వుంటే.. తాజాగా టమాటా ఒక్కసారిగా ధర పడిపోయింది. నిన్న మొన్నటి వరకు మదనపల్లె మార్కె ట్‌లో రూ.10గా ఉన్న కిలో టమాటా.. ఇప్పుడు రూ.2కు పడిపోయింది. ఒక్కసారిగా దిగుబడి మార్కెట్‌కు పోటెత్తడం.. మార్కెటింగ్ శాఖ అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోకపోవడంతోనే ఈ సమస్య తలెత్తింది. దీంతో రైతులు.. దిగాలు పడ్డారు. రాష్ట్రంలో మిర్చి, టమాటా సమస్యల పరిష్కారం కోసం.. నలుగురు మంత్రులతో కూడిన కమిటీని వేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్టు తెలిసింది.