అవును కేజీ టమాటా ఎనిమిది రూపాయిలే
తాజాగా కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో టమాటా ధరలు మరీ ఇబ్బందికర రీతిలో పడిపోయాయి
ధర విన్నంతనే చెమటలు పట్టేసిన టమాటా ధర పడిపోయింది. మొన్నటి వరకు కేజీ టమాటా రూ.180 నుంచి రూ.200 వరకు పలకటం తెలిసిందే. భారీగా పెరిగిన ధరల నేపథ్యంలో పెద్ద ఎత్తున టమాటా పంట వేయటం.. దాని దిగుబడి మార్కెట్లోకి ఒక్కసారి రావటంతో దాని ధర దారుణంగా పడిపోయింది. మొన్నటివరకు డబుల్ సెంచరీకి దగ్గరకు వచ్చేసిన టమాటాలు ఇప్పుడు సింగిల్ డిజిట్ ను దాటని పరిస్థితి.
తాజాగా కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో టమాటా ధరలు మరీ ఇబ్బందికర రీతిలో పడిపోయాయి. నాణ్యత ఆధారంగా సూపర్ ఫైన్ క్వాలిటీ కేజీ రూ.16కు మించి పలకలేదు. ఇక.. మామూలుగా ఉన్న టమాటా ధరలు (నాణ్యత మరీ అంత తీసికట్టుగా ఏమీ లేదు) కేజీ ఎనిమిది రూపాయిలు పలికిన పరిస్థితి. దీంతో.. టమాటా రైతులకు దిక్కుతోచని పరిస్థితి.
డిమాండ్ అధికంగా ఉండి.. సప్లై తక్కువగా ఉన్న వేళ.. అదిరే ధరలు పలకటం తెలిసిందే. అయితే.. కొద్ది రోజులుగా మార్కెట్లోకి పెద్ద ఎత్తున పంట రావటంతో ధరలు తగ్గిపోతున్నాయి. రానున్న రోజుల్లో మరింతగా ధరలు తగ్గే వీలుందని చెబుతున్నారు. హోల్ సేల్ మార్కెట్ లో ఇంత దయనీయంగా ధరలు ఉంటే.. రిటైల్ మార్కెట్ లో మాత్రం కేజీ టమాటా రూ.30 నుంచి రూ.40 మధ్య పలుకుతోంది. దీంతో.. కష్టపడి పండించిన రైతుకు ఏ మాత్రం లాభం చేకూరని దుస్థితి. మొన్నటివరకు టమాటా పండించిన రైతులకు కాసులు కురిపించిన స్థానే.. ఇప్పుడు కన్నీళ్లను మిగులుస్తోందంటూ వాపోతున్నారు.