ఒక్క ఉద్యోగి కోసం $2.7 బిలియన్స్... గూగుల్ మెచ్చిన ఎవరీ నోమ్?
గతంలో రిజైన్ చేసి వెళ్లిన ఓ ఎంప్లాయిని తిరిగి తీసుకునేందుకు గూగుల్ ఏకంగా 2.7 బిలియన్ డాలర్స్ చెల్లించింది!
విషయం ఉండాలి కానీ.. సరైన టాలెంట్ ఉన్నవారికోసం కార్పొరేట్ కంపెనీలో కోట్లకు కోట్లు ప్యాకేజీలు ఆఫర్ చేస్తూ తమవద్ద పని చేయడానికి రెడ్ కార్పెట్లు పరుస్తుంటాయి! అలాంటి సంఘటన తాజాగా తెరపైకి వచ్చింది. గతంలో రిజైన్ చేసి వెళ్లిన ఓ ఎంప్లాయిని తిరిగి తీసుకునేందుకు గూగుల్ ఏకంగా 2.7 బిలియన్ డాలర్స్ చెల్లించింది!
అవును... ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం మూడేళ్ల క్రితం కంపెనీని విడిచిపెట్టి వెళ్లిన నోమ్ షజీర్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణుడిని తిరిగి తీసుకొవడానికి గూగుల్ స్పష్టంగా 2.7 బిలియన్ డాలర్స్ చెల్లించింది. గతంలో చాట్ బాట్ ను అభివృద్ధి చేసిన నోమ్ షజీర్ విభేదాల కారణంగా మూడేళ్ల క్రితం గూగుల్ ని విడిచిపెట్టి వెళ్లాడు.
మోస్ట్ టేలెంటెడ్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా చెప్పే షజీర్.. 2000లో గూగుల్ ప్రారంభ నియామకాలలో ఒకరు. ఇతడు 2021లో తన సహోద్యోగి డేనియల్ డి ఫ్రీటాస్ తో కలిసి చాట్ బాట్ ను తయారు చేశాడు. అయితే... దాన్ని విడుదల చేయడానికి గూగుల్ నిరాకరించింది. దీంతో.. కంపెనీకి బై బై చెప్పాడు. అనంతరం.. "క్యారెక్టర్.ఏఐ" ని స్థాపించారు.
సిలికాన్ వ్యాలీలో టాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ గా అవతరించిన ఈ క్యారెక్టర్.ఏఐ... గత ఏడాది $1 బిలియన్ విలువను టచ్ చేసింది. ఈ సమయంలో గూగుల్ 2.7 బిలియన్ డాలర్స్ చెక్ ను షజీర్ కోసం కట్ చేసినట్లు చెబుతున్నారు. క్యారెక్టర్.ఏఐ టెక్నాలజీకి లైసెన్స్ ఇవ్వడం కోసం ఈ చెల్లింపు జరిగిందని అంటున్నారు.
దీంతో... నివేదికల ప్రకారం గతంలో ఏఐ అభివృద్ధి విషయంలో గూగుల్ చాలా జాగ్రత్తగా ఉందని విమర్శించిన నోమ్ షజీర్... ఇప్పుడు దాని అత్యాధునిక ఏఐ టెక్నాలజీ నెక్స్ట్ వెర్షన్ జెమినీ సృష్టిని పర్యవేక్షిస్తున్న ముగ్గురు నాయకుల్లో ఒకరు!